Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో అసలు నిందితులు ఎవరో తేల్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
ఈ కేసులో ప్రభుత్వం విచారణను జాప్యం చేస్తూ.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇద్దరే నిందితులు అని మంత్రి కేటీఆర్ చెప్పగా.. సిట్ 13 మందిని ఎందుకు అరెస్ట్ చేసిందో చెప్పాలని అన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని, లేకపోతే బర్తరఫ్ చేయాలని అంటున్నారు. యువతీ యువకులు కష్టపడి కోచింగ్ తీసుకుంటే పేపర్ లీక్స్ తో వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. అలాగే అభ్యర్థులు అందరికీ లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును కేసీఆర్ ప్రభుత్వం అంధకారం చేసిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందని బండి సంజయ్ వివరించారు. వచ్చేది రామరాజ్యం అని, నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. పేపర్ లీక్ కేసులో ప్రభుత్వ మెడలు వంచే దాకా ఉద్యమిస్తామని చెప్పారు. సిట్ అధికారులను తానే రమ్మన్నానని.. నోటీసుకు కూడా తీసుకున్నాని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ కొడుకు నౌకరీ ఊడగొట్టాలే.. మా నౌకరీలు మాకు కావాలని బండి సంజయ్ అన్నారు.