Rahul Gandhi Disqualification:


కర్మ వెంటాడుతుంది..


రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. ఈ నిర్ణయాన్ని సమర్థించారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దోషులుగా తేలిన ఎంపీలను చట్ట పరంగా కాపాడేందుకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో రాహుల్ ఆ ఆర్డినెన్స్‌ పేపర్లను చించేసి అవమానించారని, కర్మ ఎవరినీ వదలదని...రాహుల్‌ను అనర్హతా వేటు రూపంలో అది వెంటాడిందని అన్నారు. 


"ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు. ఆయనపై అనర్హతా వేటు పడితే మాదా బాధ్యత..? హిందూ ధర్మం ప్రకారం కర్మ ఎవరినీ వదలదు వెంటాడుతుందని నమ్ముతాం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎంపీలపై అనర్హతా వేటు వేయకుండా రక్షించే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కానీ అప్పుడు రాహుల్ దాన్ని కించపరిచారు. మీ పార్టీలో ఉన్న OBC నేతల్నే అడగండి. మీ వ్యాఖ్యలపై వాళ్ల అభిప్రాయమేంటో కనుక్కోండి. విమర్శలు చేయడం వరకూ ఓకే. కానీ మొత్తం ఆ వర్గాన్ని కించపరచడం ఏంటి..? వాళ్ల ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టు కాదా..? చట్టం చేసింది కరెక్టే. మీకు ఆ తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకోండి" 


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి 






రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అని..కానీ ఇలా అవమానకరంగా మాట్లాడటం తగదని అన్నారు హిమంత. కొన్నిసార్లు పొరపాటున మాట్లాడినా..వెంటనే క్షమాపణలు చెబుతామని వివరించారు. కానీ రాహుల్ మాత్రం క్షమాపణలు చెప్పనే చెప్పను అని తేల్చి చెప్పడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. 


"రాజకీయాల్లో ఇలా విమర్శించుకోడవడం మామూలే. అది పెద్ద విషయం కాదు. ఒకవేళ ఏమైనా పొరపాటున నోరు జారితే వెంటనే ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తాం. లేదంటే మీడియా ముందుకు వచ్చి సారీ చెబుతాం. కానీ గత ఐదేళ్లలో రాహుల్ ఏ ఒక్కరికీ క్షమాపణలు చెప్పలేదు. మేం నరేంద్ర మోదీకి సారీ చెప్పమనడం లేదు. ఓబీసీ వర్గానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాం. మీకే కాదు. ఆ వర్గ ప్రజలకూ ఆత్మగౌరవం ఉంటుందని ఆలోచించాలి. దీని వెనకాల ఎలాంటి రాజకీయ కోణాలు లేవు. మీరు (రాహుల్) ప్రతిపక్ష నేత. మీరు ఏ మీటింగ్‌లకైనా వెళ్లొచ్చు. ఏ ర్యాలీలైనా చేయొచ్చు. అదంతా మీ ఇష్టం. దానిపై ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ హద్దులు మీరి ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం చేయొద్దు. ఇది కచ్చితంగా తప్పే."


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి 


Also Read: Rahul Gandhi: మోదీ కళ్లలో భయం కనిపించింది, జీవితాంతం జైల్లో పెట్టినా పోరాటం ఆపను - రాహుల్ గాంధీ