Delhi Excise Policy Case:
ఏప్రిల్ 5న విచారణ..
ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా లిక్కర్ స్కామ్‌లో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ అధికారులు రోజూ గంటల పాటు ఆయనను విచారిస్తున్నారు. అటు కోర్టు కూడా ఆయన కస్టడీ గడువును పెంచుతూ పోతోంది. కీలక వివరాలు సిసోడియా చెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. సిసోడియా మాత్రం తాను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నట్టు వివరిస్తున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దీనిపై విచారణ జరగలేదు. కస్టడీని పొడిగిస్తోందే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. ఇవాళ ఈ పిటిషన్‌పై విచారించాల్సి ఉన్నా...ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 5వ తేదీన విచారిస్తామని వెల్లడించింది. స్పెషల్ జడ్జ్ నాగ్‌పాల్ ఈ విచారణను వాయిదా వేశారు. దీనిపై ఈడీ వివరణ ఇచ్చిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సేకరించేందుకు మరి కొంత సమయం కావాలని తెలిపారు. ఓ వైపు విచారణ పూర్తికాకుండానే..సిసోడియాకు బెయిల్ ఇవ్వడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ కీలక సమయంలో బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశముందని సీబీఐ అధికారులు వాదించే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన మొబైల్ ఫోన్లు ధ్వంసం చేయడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.