కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. అధికార బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆ వర్గానికి ఉన్న 4శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసిన బొమ్మై ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో ముస్లింలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విభాగంలో 10శాతం రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. మరోవైపు.. ముస్లింలకు రద్దు చేసిన 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు కేటాయించనున్నారు.
బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కేటాయింపుల తొలగించడంతోపాటు.., రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. దీనికి ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్లను 50 నుంచి 56 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ 10 శాతం కేటగిరిలో బ్రహ్మణులు, వైశ్యులు, ముదలియార్లు, జైన సామాజికవర్గాల తరహాలోనే ముస్లింలు కూడా రిజర్వేషన్లు పొందనున్నారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం బొమ్మై మతపరమైన మైనారిటీల కోటాను రద్దు చేసి వారిని ఎలాంటి షరతులు లేకుండా ఈడబ్ల్యూఎస్ కిందికి తీసుకువస్తామని ప్రకటించారు.
గతేడాది బెలగావిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2సీ, 2డీ అనే రెండు కొత్త రిజర్వేషన్ కేటగిరీలను సృష్టించి ముస్లింలకు ఉన్న 4 శాతాన్ని వొక్కలిగ (2శాతం), లింగాయత్ (2 శాతం) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు) రిజర్వేషన్ 15 నుంచి 17 శాతం, ఎస్టీల రిజర్వేషన్ 3 నుంచి 7 శాతానికి పెంచారు. "కోటా కేటగిరీలలో మార్పులను క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సు చేసింది మరియు మేము దానిని అమలు చేసాము" అని బొమ్మై తెలిపారు.
"రాజ్యాంగంలో మతపరమైన మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం లేదు. ఇది ఏ రాష్ట్రంలోనూ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మతపరమైన మైనారిటీలకు రిజర్వేషన్లను కోర్టు కొట్టివేసింది. బీఆర్ అంబేద్కర్ కూడా కులాలకు రిజర్వేషన్లు అని స్పష్టంగా చెప్పారు" అని కర్ణాటక ముఖ్యమంత్రి పేర్కొన్నారు. త్వరలో లేదా తరువాత, ఎవరైనా మతపరమైన మైనారిటీలకు రిజర్వేషన్ల అంశంపై సవాలు చేయవచ్చు. అందువల్లే ప్రభుత్వం చురుకైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ముస్లింలకు10 శాతం ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా అవే ఆర్థిక ప్రమాణాలు కొనసాగుతాయని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో ఉన్న ‘కడు కురుబ’, ‘గొండ కురుబ’ అనే రెండు గొర్రెల కాపరి వర్గాలను ఎస్టీ కేటగిరీలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేశామని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు.
దీంతో పాటు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక మంత్రివర్గం శుక్రవారం తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ద్వారా జనసంఖ్య అనుగుణంగా రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఇటీవల పెంచిన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌నూ తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంట్‌లో చర్చకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపారు. కాగా.. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.