LPG Cylinder Subsidy: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం కింద ఎల్పీజీ సిలిండర్ పై ఇచ్చి రూ.200 సబ్సిడీని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో 9.6 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఎల్‌పీజీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీని మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో 9.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు అందించడానికి 14.2 కిలోల సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీని ఏడాదికి 12 రీఫిల్స్‌కు ఆర్థిక వ్యవహారాల సబ్ కమిటీ ఆమోదించిందని ఐ అండ్ బీ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో అన్నారు.
ఎల్పీజీ ధరలు పెరిగినా
మార్చి 1, 2023 నాటికి, 9.59 కోట్ల మంది PMUY లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం వ్యయం రూ.6,100 కోట్లు కాగా 2023-24కి రూ.7,680 కోట్లు ఉంటుందని మంత్రి తెలిపారు. సబ్సిడీని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయంగా ఎల్‌పీజీ ధరలు భారీగా పెరిగాయని, అయినా పీఎంయువై లబ్ధిదారులపై భారంపడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
2016లో ప్రారంభం
ప్రధాని మంత్రి ఉజ్వల యోజక పథకం కింద 2019-20లో వినియోగదారుల సగటు ఎల్పీజీ వినియోగం 3.01 రీఫిల్స్ ఉండగా, 2021-22లో 3.68కి అంటే 20 శాతం పెరిగింది. PMUY లబ్ధిదారులందరూ సబ్సిడీకి అర్హులు. గ్రామీణ, నిరుపేద పేద కుటుంబాలకు ఎల్పీజీ అందుబాటులోకి తీసుకురావడానికి, పేద కుటుంబాల మహిళలకు డిపాజిట్ రహిత ఎల్పీజీ కనెక్షన్‌లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 మే నెలలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నాలుగు శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదించింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరుగుతుంది. ఈ పెంపుతో కేంద్రంపై అదనంగా రూ. 12,815 కోట్లు భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 2023 జనవరి 1వ తేదీ నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. పెరుగుతున్న ధరల నుంచి కేంద్రం ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కల్పించేందుకు డీఏ పెంచినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేంద్రం పరిధిలోని 47.58 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పింఛన్ దారులకు లబ్ది చేకూరనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయంతో రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తుంది.