CM KCR On Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ చీకటిరోజు అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని కేసీఆర్ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన  పార్లమెంట్ ను సైతం తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమన్నారు.  ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని ఆవేదన చెందారు. ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందన్నారు. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని విమర్శించారు.  పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్న కేసీఆర్... దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని కోరారు. 






తొందరపాటు చర్య- మంత్రి కేటీఆర్ 


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హత వేటు వేయ‌డాన్ని మంత్రి హ‌రీశ్‌ రావు తప్పుబట్టారు. రాహుల్ లోక్‌స‌భ స‌భ్యత్వం ర‌ద్దు చేయ‌డం బీజేపీ నియంతృత్వానికి పరాకాష్ఠ అని మండిప‌డ్డారు. బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హ‌క్కులు ప్రమాదంలో ప‌డ్డాయ‌న్నారు.    రాహుల్ గాంధీ లోక్‌స‌భ స‌భ్యత్వం ర‌ద్దు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాహుల్‌పై అన‌ర్హత వేటు వేయ‌డం రాజ్యాంగాన్ని దుర్వినియోగ‌ప‌ర‌చ‌డ‌మే అని కేటీఆర్ అన్నారు. అప్రజాస్వామిక ప‌ద్ధతిలో రాహుల్‌పై వేటు వేశార‌ని మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా ఫ్రెంచ్ త‌త్వవేత్త వాల్‌టేర్, జ‌ర్మన్ థియాల‌జిస్ట్ మార్టిన్ నిమాల‌ర్ కోట్స్‌ను మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.  ఇది తొందరపాటు చర్యగా అభివర్ణించారు. 










రాహుల్ గాంధీపై వేటు 


రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చడమే కాకుండా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుందన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఉదయం లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు రాహుల్. ఆ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నారు సెక్రటరీ జనరల్. 


"పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీని సూరత్ దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని వాయనాడ్‌ ఎంపీగా ఉన్న ఆయనపై అనర్హతా వేటు వేస్తున్నాం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం" 


-  లోక్ సభ సెక్రటరీ