Telangana Latest News: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొంది. అప్పటి వరకు యాక్టివ్‌ పాలిటిక్స్ చేసిన కేసీఆర్ ఒక్కసారిగా ఇన్‌యాక్టివ్ అయిపోయారు. అప్పుడప్పుడు నేతలను కలవడం తప్పే పెద్దగా రాజకీయాలపై స్పందించడం లేదు. మొత్తం రాజకీయాన్ని ముగ్గురే నడిపిస్తున్నారు. కేటీఆర్, హరీష్‌రావు, కవిత ద్వారానే అన్నింటినీ చక్కబెడుతున్నారు. ఏడాదిన్నర వరకు ఇది సమక్రమంగా సాగినప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం పుకార్లు మొదలయ్యాయి. పార్టీలో ఇంటర్నల్‌గా ఏదో జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. అందుకు తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా జరగడంతో నిప్పులేనిది పొగరాదు కదా అని అనుకున్నారు. 

అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కేటీఆర్‌ నేరుగా ఇవాళ(శుక్రవారం) హరీష్‌రావు ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. హరీష్‌రావు తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. తర్వాత ఇద్దురు వేరుగా సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు గురించి మాట్లాడుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిందీ సమావేశం. కొందరు పార్టీ నేతలు వారితో ఉన్నప్పటికీ సమావేశంలో పాల్గొనలేదని తెలుస్తోంది. 

ఈ మధ్య కాలంలో పార్టీలో లుకలుక ఉన్నాయని పుకార్లకు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. మొన్న వరంగల్ సభ కోసం జరిగిన ప్రిపరేషన్‌లో హరీష్‌రావును పక్కన పెట్టారనే చర్చ మాత్రం పార్టీలోనే జరిగింది. నేరుగా ఎవరూ దీనిపై మాట్లాడకపోయినా గుసగుసలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు కవిత కూడా తన కార్యక్రమాలు జాగృతి సమితి పేరుతో చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో వెళ్తుండటంతో కచ్చితంగా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీనిపై కవిత కూడా వాటికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. ఇలాంటి పుకార్లకు పార్టీ అధినాయకత్వమే చెక్ పెట్టాలని అన్నారు. తామంతా కేసీఆర్ సైనికులం అని చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన హరీష్‌రావు కూడా అదే సమాధానం చెప్పారు. తామంతా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నామని అన్నారు. కేసీఆర్ ఏం చెబితే దాని కోసం పని చేస్తామని అన్నారు. కేటీఆర్‌కు నాయకత్వం అప్పగించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన నాయకత్వంలో వర్క్ చేస్తామన్నారు. 

హరీష్‌రావు, కవిత స్టెట్మెంట్స్ అలా ఇవ్వడమే కాకుండా కేటీఆర్ కూడా మరో అడుగు ముందుకేశారు. నేరుగా హరీష్‌రావు ఇంటికెళ్లి సమావేశమయ్యారు. పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీనిపై దుష్ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఇచ్చిన హామీలపై చర్చ జరగకుండా, మొన్న వరంగల్ సభ విజయవంతపై చర్చ జరగకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. 

ఇప్పుడు కేటీఆర్, హరీష్‌రావు సమావేశంపై కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఎప్పుడూ లేనంత ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తోంది. ప్లీనరీలో హరీష్‌రావు పక్కన పెట్టారని దాన్ని కవర్ చేసుకోవడానికే కేటీఆర్ వెళ్లాలన ఆరోపిస్తున్నారు. హరీష్‌రావు, కవిత వేర్వేరు పార్టీలు పెడతారనే ప్రచారంలో ఉన్నందునే సడెన్‌గా కేటీఆర్‌ చర్చలు జరిపారని అన్నారు. గతంలో ఫంక్షన్‌లు జరిగినా ఎలాంటి వేడుకలు జరిగినా కేటీఆర్ వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌పై వస్తున్న ఆరోపణలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది బీజేపీ. కచ్చితంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని.... సమీప భవిష్యత్‌లో కచ్చితంగా సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేయబోతున్నారని అందుకు కాంగ్రెస్‌తో ఒప్పందం జరిగిందని ఆరోపిస్తోంది బీజేపీ