Saraswati Pushkaralu Kaleshwaram : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదిలో పుష్కస్నానం ఆచరిస్తున్నారు భక్తులు. అనంతరం కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. అయితే కాళేశ్వరం వెళ్లేవారంతా ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఓ రెండు రోజుల్లో అవన్నీ చుట్టేయవచ్చు.
కోటగుళ్లు
కాళేశ్వరక్షేత్రం నుంచి కోటగుళ్లు 67 కి.మీ.దూరంలో ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల సముదాయంలో మొత్తం 22 గుళ్లు ఉన్నాయి. కాకతీయుల నిర్మాణ నైపుణ్యానికి ఇవి ఉదాహరణలు. ఈ గుడులన్నీ ముక్కంటికే అంకితం చేశారు.
రామప్ప
ములుగు జిల్లాలో ఉన్న రామప్ప.. కాళేశ్వరం నుంచి 79 కి.మీ. దూరంలో ఉంది. రేచర్ల రుద్రుడు 13వ శతాబ్దంలో రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ఈయన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సర్వసైన్యాధ్యక్షుడు . నిర్మించిన శిల్పి పేరుతోనే ఆలయాన్ని పిలుస్తారు. ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు ముఖంగా నిర్మించిన ఈ ఆలయాన్ని 2021 జులై 25న యునెస్కో గుర్తింపు లభించింది.
ధర్మపురి
జగిత్యాల జిల్లా ధర్మపురిలో యోగ నారసింహుడి ఆలయం ఉంది. కాళేశ్వరానికి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నారసింహ క్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని చెబుతారు. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే రాజు పరిపాలించడం వల్ల ఈ పేరు వచ్చిందని స్థలపురాణం. ధర్మవర్మ తపస్సుకు మెచ్చిన నారసింహుడు యోగ నారసింహుడిగా ప్రహ్లాదుడితో కలసి ఇక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడని చెబుతారు. దీనిని త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడి విగ్రహంతో పాటూ శివుడు రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ యముడి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ధర్మపురికి వెళితే యమపురి ఉండదని భక్తుల విశ్వాసం. ఇక్కడ బ్రహ్మగుండం, యమగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండం పేర్లతో పుష్కరిణిలున్నాయి.
మేడారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం ఆదివాసీలకు ఆరాధ్య దైవం. ఈ క్షేత్రం కాళేశ్వరం నంచి 83 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమ్మక్క సారలమ్మ కొలువైన ఈ ప్రాంతంలో ప్రతి రెండేళ్లకోసారి వనజాతర నిర్వహిస్తారు. కన్నులపండువగా జరిగే ఈ జాతరలు తెలంగాణతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
వేయి స్తంభాల ఆలయం
కాళేశ్వర క్షేత్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది వేయి స్తంభాల ఆలయం. ఖిలా వరంగల్ లో ఉన్న వేయి స్తంభాల ఆలయానికి 1200 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల పరిపాలనలో నిర్మించిన పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి. రాష్ట్ర చిహ్నమైన కాకతీయుల కళాతోరణంతో పాటు నాటి కాలంలో నిర్మించిన ఆలయాలను ఇక్కడ చూడొచ్చు.
లక్నవరం సరస్సు
ములుగుజిల్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు కాకతీయుల గొలుసుకట్టు చెరువులకు ప్రతీక. కాళేశ్వరం నుంచి 104 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక ద్వీపాన్ని కలుపుతూ నిర్మించిన తీగల వంతెన ఇక్కడ చాలా ప్రత్యేకం. ఆ తర్వాత మరో రెండు వంతెనలు నిర్మించారు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి