Southwest Monsoon News | హైదరాబాద్: వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడేలా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించి, రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
నకిలీ విత్తనాలపై ప్రభుత్వం కఠిన చర్యలునకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు విక్రయించి.. రైతులను మోసం చేసే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్ల నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని చెప్పారు.
పీడీ యాక్ట్ కేసులు నమోదుఎవరెవరు, ఎక్కడెక్కడ కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు. ఎక్కడ నిల్వ చేస్తున్నారు, ఎక్కడ నుంచి రవాణా అవుతున్నాయనే సమాచారం అధికారులకు ఉందని, ఎవరినీ ఉపేక్షించకుండా కేసులు నమోదు చేసిన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వానాకాలం పంటల సాగుపై సమీక్ష చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. రైతుల నుంచి డిమాండ్ ఉన్న విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
రైతులు ఆందోళన చెందవద్దురైతులు ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ముందుగానే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వర్షాలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించిన విషయాన్ని రైతులు గమనించాలన్నారు. అందుకు తగినట్లుగా అన్నదాతలు పంటలు వేసుకోవాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని అప్రమత్తం చేశారు. ప్యాక్డ్ విత్తనాలు తప్ప లూజ్ విత్తనాలు కొనవద్దని, విత్తన పాకెట్లు కొనేటప్పుడు బిల్లును, పాకెట్లను పంట కాలం ముగిసేంత వరకు మీ వద్ద భద్రపరుచుకోవాలని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నకిలీ కంపెనీలు, కల్తీ విత్తనాల బారిన పడకుండా పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.