Minister Konda Surekha criticized ministers: తెలంగాణ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొందరు మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. నా దగ్గరకు కూడా ఓ కంపెనీ వాళ్లు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు. మీ ఒక్క రూపాయి కూడా నాకు వద్దు అని వాళ్లతో చెప్పాను. బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించాననన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సందర్భం లేకపోయిన ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.
తాను డబ్బులు తీసుకోవడం లేదని చెప్పడం వరకూ ఓకే కానీ ఇతర మంత్రులు తీసుకుంటున్నారని చెప్పడం ఏమిటన్నది కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కలేదు. కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఉందని స్వయంగా మంత్రి ఒప్పుకున్నట్లు అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సురేఖ ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. మంత్రులు ముప్ఫై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని.. కొండా సురేఖ నిజం ఒప్పుకున్నందుకు అభినందనులు అని సెటైరిక్ గా స్పందించారు.
ఈ అంశంపై వివాదం రేగడంతో మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాను చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి మాత్రమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి కాదని కవర్ చేసుకున్నారు. తాను గత ప్రభుత్వంలో మంత్రుల గురించి మాత్రమే మాట్లాడానని.. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెబుతానన్నారు.
కొండా సురేఖ పైర్ బ్రాండ్ లీడర్. అందుకే మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఆమెతో పాటు ఆమె భర్త కొండా మురళి తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అసంతృప్తిగానే ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో వారు ఒంటెత్తు పోకడలకు పోతూంటారన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా నాగ చైతన్య, సమంత విడాకులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారు. కేబినెట్ సహచరులపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో సహజంగానే పార్టీలో అసహనం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో హైకమాండ్ కు సురేఖపై ఫిర్యాదులు చేసే అవకాశాలు ఉన్నాయి.