Samantha Manager Reaction On Rumours With Raj Nidimoru: 'శుభం' సక్సెస్ జోష్‌లో ఉన్న సమంత ప్రమోషన్లలో భాగంగా మూవీ టీంతో పాటు డైరెక్టర్ రాజ్ నిడమోరుతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు వైరల్ కాగా.. గత 2 రోజులుగా పలు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. దర్శకుడు రాజ్ భుజంపై సమంత వాలి ఉన్న ఫోటోలు చూసి ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అంతకు ముందు కూడా వీరిద్దరిపై పలు రూమర్స్ వచ్చాయి. 

వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని ఆంగ్ల మీడియాల్లో కథనాలు సైతం వచ్చాయి. తాజాగా.. వీటిపై సమంత మేనేజర్ స్పందించారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఖండించారు. రాజ్ నిడమోరుతో ఆమె రిలేషన్‌లో ఉన్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 'శుభం' సక్సెస్ ప్రమోషన్స్ టైంలో తీసిన ఫోటోలను ఇలా తప్పుడు వార్తలకు లింక్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు న్యూస్ ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దంటూ కోరారు.

Also Read: ఓటీటీలో కాదు థియేటర్లలోనే రిలీజ్ - 'భూల్ చుక్ మాఫ్' మూవీపై టీం అనౌన్స్‌మెంట్

అసలేం జరిగిందంటే?

హీరోయిన్ సమంత 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి 'శుభం' మూవీని నిర్మించారు. ఈ నెల 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం మూవీ సక్సెస్‌ను టీం ఎంజాయ్ చేస్తోంది. సక్సెస్ ప్రమోషన్స్‌లో భాగంగానే సమంత మూవీ టీంతో పాటు రాజ్ నిడమోరుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'శుభం'తో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ పేర్కొన్నారు. రాజ్ భుజంపై వాలి ఉన్న ఫోటో షేర్ చేయగా.. వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే వార్తలు మళ్లీ హల్చల్ చేశాయి. 

రాజ్ - డీకే సంయుక్తంగా తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ'లో సమంత నటించారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ తరచూ కలిసి కనిపిస్తుండడంతో వాటికి బలం చేకూరింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రూమర్స్ రాగా.. అవన్నీ తప్పుడు వార్తలంటూ సమంత మేనేజర్ స్పష్టం చేశారు.

రాజ్ సతీమణి పోస్ట్ వైరల్

ఇదే సమయంలో రాజ్ సతీమణి శ్యామాలి ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'నా తరఫున మాట్లాడేవారికి.. నా గురించి మాట్లాడేవారికి.. నేను చెప్పేది వినే వారికి.. నా గురించి వార్తలు వినే వారికి.. నా గురించి రాసే వారికి.. నా కోసం ఆలోచించే వారందరికీ దేవుడి ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా.' అంటూ ఓ సందేశాత్మక పోస్ట్ షేర్ చేయగా వైరల్ అయ్యింది. ఆమె దేన్ని ఉద్దేశించి ఇలా పెట్టారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగింది. 2015లో రాజ్ నిడమోరుతో ఆమెకు వివాహం జరిగింది. వీరిద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా హల్చల్ చేశాయి.