Bhool Chuk Maaf New Theatrical Release Date: 'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్ తెలుగు సినీ ఇండస్ట్రీపై అంతగా లేకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీపై గట్టిగానే పడింది. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశానికి సపోర్ట్ చేస్తూ కొన్ని సినిమాల ఈవెంట్స్ క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకోగా.. మరికొన్ని సినిమాల రిలీజ్ కూడా వాయిదా పడింది.
థియేటర్లలోనే భూల్ చుక్ మాఫ్
ఈ క్రమంలో రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ 'భూల్ చుక్ మాఫ్' ఈ నెల 9న రిలీజ్ కావాల్సి ఉండగా.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. అయితే, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయడం లేదని నేరుగా ఓటీటీలోకే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ నెల 16 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో' వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు.
అయితే, ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సద్దుమణిగాయని.. మూవీని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 'మాడాక్ ఫిల్మ్స్' తాజాగా ప్రకటించింది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. 'ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగిన తరుణంలో.. ఈ సినిమాను థియేటర్లలోనే ఆడియన్స్ ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఈ చిత్రం తప్పకుండా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. నిరంతరం మాకు సపోర్ట్‌గా ఉన్న ఎగ్జిబిటర్లకు కృతజ్ఞతలు.' అని నిర్మాత దినేశ్ విజన్, పీవీఆర్ ఐనాక్స్‌తో చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: పాన్ ఇండియా లెవల్‌లో భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్... టాలీవుడ్ టాప్ హీరోలతో వీఐ ఆనంద్ మల్టీస్టారర్
'భూల్ చుక్ మాఫ్' రిలీజ్ విషయంలో టీమ్ ఎదుర్కొన్న సవాళ్లను తాము అర్థం చేసుకున్నట్లు పీవీఆర్ ఐనాక్స్ తెలిపింది. పెన్ స్టూడియోస్‌తో కలిసి పీవీఆర్ ఐనాక్స్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయనుంది.
ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి కరణ్ శర్మ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ ప్రధాన పాత్రలు పోషించారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని గవర్నమెంట్ జాబ్ సాధించిన ఓ యువకుడి స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ మూవీలో 'టింగ్ లింగ్ సజా మే' పాటను ఇటీవల రిలీజ్ చేయగా.. రాజ్, ధనశ్రీ తమ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అంతకు ముందు 'భూల్ చుక్ మాఫ్' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అంటూ ప్రకటన చేశారు. తాజాగా.. పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు.