Cheetah In Nirmal District | సారంగాపూర్: నిర్మల్ జిల్లా ప్రజలను పెద్దపులి, చిరుతపులి హడలెత్తిస్తున్నాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిధిలోని అటవి ప్రాంతంలో చిరుత పులితో పాటు ఓ పెద్దపులి (Bengal Tiger) సంచరిస్తోంది. మూడు రోజులక కిందట బోథ్ మండలంలోని వజ్జర్ అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి మరుసటి రోజు తిరిగి సారంగాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వెళ్ళింది.
తాజాగా సారంగాపూర్ మండలంలోని, అడెల్లితాండ, రవీంద్రనగర్ తండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మేకలను మేపేందుకు అడవికి భువనగిరి సాయినాథ్ అనే యువకుడు వెళ్లగా.. మేస్తున్న మేకలు ఒక్కసారిగా బెదిరిపోవడంతో అనుమానం వచ్చి చూడగా మేకల మంద వైపు పెద్దపులి రావడానికి గమనించి ఒక్కసారిగా అతడు చెట్టుపైకి ఎక్కాడు. పెద్దపులి దాడి చేసేందుకు దగ్గరికి వస్తుండగా అతడు ఒక్కసారిగా కేకలు వేశాడు, చెట్టుపై నుండే పెద్దపులి సెల్ ఫోన్ లో వీడియోను చిత్రీకరిస్తూ పెద్దగా కేకలు వేశాడు. దీంతో పెద్దపులి మేకల మందపై దాడి చేసి రెండు మేకలను చంపింది. మరో మేకపై దాడి చేసి గాయపరిచింది. విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా గ్రామస్తులు కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ బాధితుడు సాయినాథ్ వద్దకు వచ్చారు. అప్పటికే పెద్దపులి అడవిలోకి వెళ్ళిపోయింది.
మూడు, నాలుగు రోజులుగా పెద్దపులి, చిరుత పులి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కనిపించినట్లు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు అడవికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అలర్ట్ గా ఉండాలని సమీప గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై నిర్మల్ అటవీ రేంజ్ అధికారి రామకృష్ణను ఏబిపీ దేశం ఫోన్ ద్వారా సంప్రదించగా.. బోథ్ వైపు నుండి వచ్చిన పెద్దపులి సారంగాపూర్ రేంజ్ పరిధిలో తిరుగుతోందని చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతపులులు చాలా ఉన్నాయని, పెద్ద పులులు సైతం తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి మహారాష్ట్రను అనుకొని ఇటువైపుగా వస్తూ పోతూ ఉంటాయన్నారు. సమీప గ్రామాల ప్రజలు పులి సంచారం ఉన్నందున అడవుల్లోకి వెళ్ళద్దని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులులకు ఎవరు ఎలాంటి హాని చేయకూడదని చెబుతున్నారు. వ్యవసాయ పొలాల్లో అడవిపందులకు అమర్చే విద్యుత్ తీగలను తొలగించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు.
అటవీశాఖ పరిహారం అందిస్తుందన్న అధికారులు
పులి దాడిలో ఎవరి పశువులైనా గాయపడినా, మరణించినా దానికి పరిహారం అటవీశాఖ తరఫున అందిస్తామని ఎవరు ఎలాంటి భయబ్రాంతులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే బాధితుడు సాయినాథ్ మాట్లాడుతూ... మేకలను మేతకు తోలుకొని వెళ్ళినప్పుడు మేకలు బెదిరిపోయాయి. ఏంటి అని పరిశీలించగా పెద్దపులి కనిపించిందని భయంతో చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నానని పెద్దపులి తన దాడికి ముందుకూ వస్తుండగా కేకలు వేస్తూ వీడియో చిత్రీకరించానని, దీంతో పెద్దపులి మేకలమందపై దాడి చేసి రెండు మేకలను తిని మరో మేకను గాయపరిచి అడవిలోకి లాక్కెళ్లిపోయిందని తెలిపాడు.
మరోవైపు చిరుత పులి ఒక ఆవు ఒక మేకపై దాడి చేసి గాయపరచడంతో పెద్దపులి చిరుతపులి సంచారం విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు వాటికి హాని తలపెట్టవద్దని ఏవైనా మేకలు పశువులను చంపితే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని వాటికి హాని తలపెట్టవద్దని గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికైనా ఎలాంటి అనుమానం కలిగినా పులి సమాచారం తెలిసిన తమకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.