Mahatma Gandhi statue In Bapu Ghat: గుజరాత్‌లో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటే విగ్రహం కంటే అతి పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.మహాత్ముడ్ని బీజేపీ గౌరవించడం లేదని ఆయన అభియోగం. తాము గౌరవిస్తామని ఆయన చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చేిసన ఈ ప్రకటన అత్యంత వ్యూహాత్మకమైనదిగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెట్టే అంశాలను రేవంత్ వరుసగా తెరపైకి తెస్తున్నారు. అందులో భాగంగానే మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటు ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. 


మహాత్ముడి కన్నా  పటేల్‌కే బీజేపీ ప్రాధాన్యం


భారతీయ జనతా పార్టీ భావజాలంలో మహాత్మాగాంధీ కన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్‌కే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాట్యూ ఆఫ్ యూనిటీని సబర్మతి నది  ఒడ్డున నియమించారు. అయితే జాతిపిత అయిన మహాత్మాగాంధీని విస్మరించారని ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో మహాత్మడిని పలువురు బీజేపీ నేతలు కించ పరుస్తూ మాట్లాడుతూ ఉంటారు.దేశ విభజనకు కారణమయ్యారని అంటూ ఉంటారు. అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం మహాత్ముడిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. 


గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి


మహాత్ముడి అంశాన్ని రాజకీయంగా ప్రభావిత అంశంగా మారుతున్న రేవంత్ 


ఏబీపీ నెట్వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే పటేల్ విగ్రహం గురించి ప్రస్తావన తెచ్చారు. టాపిక్ మహాత్మగాంధీ గురించి కానీ పటేల్ గురించి కానీ లేదు. కానీ రేవంత్ వ్యూహాత్మకంగా స్సేస్ క్రియేట్ చేసుకున్నారు. స్వాతంత్రం తెచ్చిన  మహాత్ముడు అంటే బీజేపీకి ఇష్టం లేదన్న ప్రచారాన్ని చేయాలనుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో రాజ్యాంగంపై రేవంత్ రెడ్డి చేిసన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీని జాతీయ స్థాయిలో ఇబ్బంది పెట్టేలా రేవంత్ చేస్తున్న వ్యూహరచన అని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 


Also Read: Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


మూసిలో మహాత్ముని అస్థికలు కలిపిన ప్రదేశం బాపూఘాట్


మహాత్ముడ్ని నాథూరాం గాడ్సే హత్య చేసిన తర్వాత దేశం మొత్తం దు:ఖించింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆయన చితాభస్మాన్ని పదకొండు నదుల్లో కలిపారు. అందులో ఒకటి మూసి నది. లంగహౌస్ వద్ద చితాభస్మాన్ని కలిపారు. ఆ ఒడ్డున బాపూఘాట్ నిర్మించారు. అప్పట్నుంచి బాపూఘాట్ ను అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ బాపూ ఘాట్ వద్ద పటేల్ విగ్రహం కన్నా పెద్ద విగ్రహాన్ని పెట్టాలనుకోవడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో బీజేపీని  ఇబ్బంది పెట్టేలా ఎజెండాను ఖరారు చేసుకుంటున్నారని వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారని భావిస్తున్నారు.