ABP Southern Rising Summit 2024 | కాంగ్రెస్ హయాంలో భాక్రాంనంగల్, నాగార్జున ప్రాజెక్టుల నుంచి అభివృద్ధి కోసం ఎన్నో  ప్రాజెక్టులను కట్టామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జ్వోతి ప్రజ్వలన చేసి సదరన్ రైజింగ్ ఈవెంట్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి అనంతరం కీలక ప్రసంగం చేశారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగింది, కానీ ఎన్డీయే హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


తెలుగు వారి ఠీవి పీవీ నరసింహారావు


ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో తో ఎన్నో మార్పులు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ హయాంలో ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు మార్చారు. కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకురావడంతో పాటు టెలికాం రంగంలో మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహాత్మగాంధీ ఆలోచనల ప్రకారం స్థానిక సంస్థల్లో అధికారాలను కల్పించిన ఘనత తమదేనన్నారు. పీవీ నరసిహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన గొప్పవ్యక్తి. తెలంగాణకు చెందిన పీవీ ఎల్పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన తెలుగు ఠీవి పీవీ నరసింహారావు అని రేవంత్ కొనియాడారు. నెహ్రూ నుంచి ఇందిరావరకు ప్రతి ఒక్కరికి మౌలిక అవసరాలు తీర్చాలని ప్రయత్నం చేశారు. తరువాత 30 ఏళ్లు టెక్నాలజీ, టెలికాం ఇతర రంగాల్లో కాంగ్రెస్, యూపీఏ సేవలు అందించింది.  


కాంగ్రెస్, యూపీఏ హయాంలో ఎన్నో విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్, యూపీఏ హయాంలో చేసిన సేవల్ని గుర్తుచేసిన రేవంత్.. ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టారు. ఆయన హయాంలో దేశానికి ఏం సేవలు చేశారు, ఎవరికి ప్రయోజనం చేకూర్చారని సదరన్ రైజింగ్ సమ్మిట్ వేదికగా ప్రశ్నించారు. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం చేశారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు పనిచేశారు కానీ ప్రజలకు మాత్రం ప్రధాని మోదీ పార్టీ ఏం చేయలేదన్నారు. 



గతంలో నార్త్ ఇండియా నుంచి ప్రధాని అయితే, సౌత్ ఇండియా నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించింది. కానీ ప్రధాని మోదీ హయాంలో ఇలాంటి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. అందుకే దక్షిణాది నుంచి నీలం సంజీవరెడ్డి, అబ్దుల్ లాంటి వాళ్లు రాష్ట్రపతి అయ్యారు. కానీ ఎన్డీయే హయాంలో  కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రధాని మోదీ పార్టీ ప్రయత్నాలు చేసింది కానీ దక్షిణాదికి చేసిందేమీ లేదని ఆరోపించారు. దక్షిణాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది, కానీ ఇప్పుడు ఎన్డీయే మాత్రం మా నుంచి పన్నులు పెద్ద ఎత్తున తీసుకుంది, తిరిగి ఇచ్చింది ఏమీ లేదంటూ మండిపడ్డారు.


 'కేంద్ర ప్రభుత్వానికి మేం ఓ రూపాయి పంపిస్తే.. మాకు 40  పైసలు తిరిగి పంపిస్తోంది. అదే ఉత్తరప్రదేశ్ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే వాళ్లకు 7 రూపాయలు వెనక్కి వస్తున్నాయి. బిహార్‌కి కూడా రూ.6 వస్తున్నాయి. నార్త్ కన్నా దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి ఎక్కువ ట్యాక్స్ వెళ్తోందని అందరికీ తెలుసన్నారు. కానీ కేంద్రం నుంచి మనకు వచ్చేది మాత్రం తక్కువే. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం మాత్రం దక్షిణాది రాష్ట్రాలన్ని పట్టించుకోవడం లేదు. ప్రధాని మోదీ ఉత్తరాదికి చెందిన వ్యక్తి కావడమే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.