Property Dispute Between Jagan and Sharmila: వైఎస్‌ జగన్, షర్మిల మధ్య వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆస్తుల కోసం జగన్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. దానికి షర్మిల కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ జగన్ అధికారిక పత్రికలో వచ్చిన కథనం మరింత సంచలనంగా మారుతోంది. చంద్రబాబుతో చేసిన షర్మిల జగన్‌కు వెన్నుపోటు పొడిచారన్న కోణంలో కథనం ఇచ్చారు. ఇందులో అన్నాచెల్లెల మధ్య ఆస్తుల పంపకాల నుంచి ఇప్పుడు జరుగుతున్న న్యాయపోరాటం వరకు అన్నింటినీ ప్రస్తావించారు. 


వారసత్వంగా వచ్చిన ఆస్తులను వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే పంచి పెట్టారని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. తన కష్టార్జితాన్ని చెల్లెలు షర్మిలకు ఇద్దామని ఒప్పందం చేసుకున్నట్టు కూడా తెలిపారు. అయితే ఆమె తనను దెబ్బతీసి జైలుకు పంపేప్రయత్నాల్లో ఉందని తెలిసి షాక్ అయ్యానంటూ వివరించారు. అయితే ఇప్పుడు తండ్రి ఉన్నప్పుడు పంపకాలు జరిగిన ఆస్తుల వివరాలను కూడా తన పత్రికలో వేశారు. 



రాజశేఖర్ రెడ్డి పంచిన ఆస్తులు ఇవే


రాజశేఖర్‌ రెడ్డి ఉన్న టైంలో వైఎస్ జగకు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న 1,815 చదరపు గజాల బిల్డింగ్ రాసిచ్చారు. పులివెందులలో 6.65 ఎకరాలను కూడా ఆయనకు బదిలీ చేశారు. షర్మిలకు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో 280 చదరపు గజాల్లో ఉన్న బిల్డింగ్తోపాటు ఇడుపులపాయలోని 51 ఎకరాల భూమి ఇచ్చారు. వీటికితోడు 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, స్మాల్ హైడ్రోపవర్ ప్రాజెక్టు లెసెన్స్ ఇచ్చారు. స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.50 శాతం షేర్లు, విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్లో 35 శాతం షేర్లును ఆమె పేరిట బదిలీ చేశారు. పులివెందులలో మరో 7.6 ఎకరాలు షర్మిలకు ఇచ్చారు. విజయలక్ష్మీ మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో 100 శాతం వాటా షర్మిల పేరు మీద ఉన్నట్టు తెలిపారు. 


జరిగిన ఒప్పందం ఇదే


అయితే ఈ ఆస్తుల విషయంలో ఎలాంటి సమస్యలు లేవని జగన్ పత్రిక స్పష్టం చేసింది. చెల్లెలపై ప్రేమానురాగాలతో రాసి ఇద్దామనుకున్న ఇతర ఆస్తులపైనే అసలు వివాదం అలుముకుందని చెప్పుకొచ్చింది. ఆ పత్రిక కథనం ప్రకారం... 2019 ఆగస్టు 31న వైఎస్ జగన్ షర్మిల మధ్య ఒక ఒప్పందం జరిగింది. తనకు చెందిన సరస్వతి ఆస్తులను షర్మిలకు బదిలీ చేయాలని ఎంవోయూ చేసుకున్నారు జగన్. దీని ప్రకారం న్యాయపరమైన సమస్యలు తొలగిన తర్వాత ఆస్తుల బదిలీకి ఓకే చెప్పారు. భౌతిక ,  నిర్మాణంలో ఉన్న ఆస్తులన్నీ వీలైనంత త్వరగా ఇచ్చేందుకు కూడా సమ్మతించారు. స్థిరాస్తికి వైఎస్ జగన్ కన్వేయన్స్ డీడ్లను రిజిస్టర్ చేయడం, షేర్ల బదిలీకి సంబంధించి బదిలీ అమలు చేయడానికి అవసరమైన పత్రాలను రిజిస్టర్ చేయాలని షరతులు పెట్టారు. 



వాటాలు ఇలా ఉన్నాయి


ఈ ఒప్పందం జరగక ముందు సరస్వతి పవర్‌లో 29.88 శాతం జగన్‌కు వాటా ఉంది. భారతీ వాట 16.30 శాతం, వైఎస్ విజయమ్మ వాట 1.42 శాతం, సాండూర్ పవర్ 18.80 శాతం, క్లాసిక్ రియాల్టీ 33.60 శాతం వాట కలిగి ఉండేవి. వాటాల ట్రాన్సఫర్‌కు ఒప్పందం జరిగిన తర్వాత వాటాలు ఇలా ఉన్నాయి. జగన్‌ వాటా 29.88% భారతీ వాట 16.30 శాతం, విజయమ్మ వాటా 48.99% , క్లాసిక్ రియాల్టీ 4.83% వాటా కలిగి ఉన్నాయి. ఇక్కడ క్లాసిక్ రియాల్టీ, సండూర్ పవర్ వాటాలను విజయమ్మకు 2021 జూన్‌ 2న బదిలీ చేశారు. షర్మిల సూచన మేరకు సరస్వతి పవర్‌లో జనార్దన్ రెడ్డి చాగారిని డైరెక్టర్‌గా నియమించారు. 


జులై 2 సమావేశంతో మొదలైన పంచాయితీ


2021 జులై 26 జన్‌కు చెందిన 74,26,294 షేర్లు, భారతికి చెందిన 40,50,000 షేర్లు గిఫ్ట్ డీడ్ కింద షర్మిలకు బహుమతిగా ఇచ్చారు. అదే సంవత్సరం ఆగస్టులో షర్మిల సూచనలతో డైరెక్టర్‌లుగా కె. యశ్వనాథ్ రెడ్డి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ సరస్వతీ పవర్ 2022-23 ఆర్థిక సంవత్సర వార్షిక సర్వసభ్య సమావేశం 2024 జులై 2 జరిగింది. దీనిపై భాగస్వాములుగా ఉన్న జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ సమావేశంలోనే జగన్, భారతి షేర్లు వైఎస్ విజయమ్మ పేరిట 2024 జులై 6న బదలాయింపు అయినట్టు తెలిపారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరుతోనే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు మాత్రం ఉన్నాయి. షేర్ ట్రాన్స్ఫర్ డీడ్లపై వాళ్ల సంతకాలు కూడా లేవు. దీనిపై ప్రస్తుత డైరెక్టర్లు విచారణ చేయలేదు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా జనార్ధనరెడ్డి చాగరి పేరు మీద 62,126 షేర్లు బదిలీ చేశారు. 


దీనిపైనే ప్రశ్నిస్తూ... 2024 ఆగస్టు 27న షర్మిలకు వైఎస్ జగన్ లేఖ రాశారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో 2024 సెప్టెంబర్ 3న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12న షర్మిల రియాక్ట్ అయ్యారు. అన్నకు ఘాటు లేఖ రాశారు. దీనిపై స్పందించిన జగన్ సెప్టెంబర్ 17 షర్మిలకు లేఖ రాశారు. ఇలా మీదితప్పంటే మీది తప్పంటూ ఒకరిపై ఒకరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.