ABP Southern Rising Summit 2024 Hyderabad | హైదరాబాద్: ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక విషయాలు వెల్లడించారు. గాంధీ ఐడియాలజీ కేంద్రం (Gandhian Ideology Centre)గా బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా నగరంలోని బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తాం. దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సర్దార్ పటేల్ విగ్రహం తరహాలో హైదరాబాద్ లోని బాపూ ఘాట్‌లో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని (Mahatma Gandhi Statue) ఏర్పాటు చేస్తాం. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. కానీ గాంధీ వారసులుగా అంతర్జాతీయ స్థాయిలో బాపూ ఘాట్‌ను అభివృద్ధి చేసి తీరుతాం. కానీ బీజేపీ, బీఆర్ఎస్ వీటిని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయని' ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఫాంహౌస్ పాలిటిక్స్ పనికిరావు
తెలంగాణలో ఫాంహౌస్ పాలిటిక్స్ చేస్తున్నారని, దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉన్నారా..? 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్యాలెస్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉన్నారా? కానీ తెలంగాణలో అదే జరుగుతుందని మండిపడ్డారు. అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రజల తరఫున గొంతుక అసెంబ్లీలో వినిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై మాజీ సీఎం కేసీఆర్ కు ఆయనకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ తనని తాను ఓ జమీందార్ గా భావిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రజలు ఎక్కువ రోజులు సహించరని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి, మాజీ సీఎం కేసీఆర్‌కి తాను ఒకటే మాట చెబుతున్నానని.. నిజంగానే అభివృద్ధి జరగాలని భావిస్తే తనతో మాట్లాడాలన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని రాజకీయాలు చేయాలని, దాంతో అభివృద్దికి ఏ ఆటంకాలు ఉండవన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం వ్యతిరేకిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గుజరాత్ లో సబర్మతీ రివర్ ఫ్రంట్ అభివృద్ది చేశారు, కానీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ను బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ గుజరాతీ కనుక, తన ప్రాంతాన్ని, ఉత్తర భారతదేశాన్ని మాత్రమే అభివృద్ధికి సహకరిస్తున్నారని.. దక్షిణాదిపై వివక్ష కొనసాగుతోందన్నారు. బాపూఘాట్ అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన లాంటి ప్రాజెక్టును బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి తన చాణక్యత ప్రదర్శించారు. మహాత్ముడి ఆశయాలతో తెలంగాణలో ప్రజా పాలన చేస్తున్నామని, గాంధీ వ్యతిరేకులు మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి ఏబీపీ సమ్మిలో మాట్లాడుతూ చెప్పకనే చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలని, తమ నుంచే కేంద్రానికి ఎక్కువగా పన్నులు వెళ్తున్నాయని బడే భాయ్ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ తన మనసులో మాట మరోసారి వెల్లడించారు.
ABP Southern Rising Summit 2024 Live Updates కోసం క్లిక్ చేయండి