ABP Southern Rising Summit 2024 Live Updates: ఈడీ వారి వెంటే పడుతుంది - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABP Southern Rising Summit 2024: ఏబీపీ నెట్‌వర్క్ 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్'కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొంటున్నారు.

Ganesh Guptha Last Updated: 25 Oct 2024 07:53 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు - కేటీఆర్ ఏమన్నారంటే?

ABP Southern Rising Summit 2024: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డే ఆ పని చేస్తున్నారని అన్నారు. 'తెలంగాణలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం విపత్తు.. ఆయన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రుల ఫోన్లు ట్యాప్‌ చేస్తుందా.? లేదా.? అని రేవంత్‌ని అడగాలనుకుంటున్నాను. రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్లెవరో నాకు తెలుసు' అని పేర్కొన్నారు.

ఈడీ వారి వెంటే పడుతుంది - కేటీఆర్

ABP Southern Rising Summit 2024: రాజకీయ నాయకుల వేట ఇప్పుడు భారతదేశంలో ఫ్యాషన్‌గా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఎన్డీయే సారథ్యంలోని పాలక ప్రభుత్వంతో ఉన్న వారి వెంట ఈడీ పడదని.. ఎవరైనా వారితో లేకుంటే వారి వెంట పడుతుందని సెటైర్లు వేశారు.


గత అసెంబ్లీ ఎన్నికల ఫలితం పెద్ద నష్టమేమీ కాదు - కేటీఆర్

ABP Southern Rising Summit 2024: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాస్త వెనుకబడిందని.. అయితే ఇది పెద్ద నష్టమేమీ కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఇది 'కొత్త అభ్యాసం' అని పేర్కొన్నారు.

దేశంలో మారుమూల గ్రామాలకు విమానాశ్రయ మౌలిక సదుపాయాలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ABP Southern Rising Summit 2024: అందరికీ విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం పోషిస్తున్న పాత్ర గురించి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో మాట్లాడారు. "మేము ఎనిమిదేళ్ల ఉడాన్ పథకం 'ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్'ని విజయవంతంగా పూర్తి చేశాం. ఇది ప్రధాని మోదీ ఆలోచన. 2014లో 74 విమానాశ్రయాలను 157కి పెంచారు. ఏ దేశమూ దీనిని సాధించలేదు. మేము దేశంలోని మారుమూల ప్రాంతాలకు విమానాశ్రయ మౌలిక సదుపాయాలను తీసుకువెళ్లాం. వాటిని విమానయాన సంస్థలకు ఎలా కనెక్ట్ చేయాలనే సవాలును సమర్థంగా ఎదుర్కొన్నాం. UDAAN దీన్ని సాధించడంలో మాకు సహాయపడింది.' అని పేర్కొన్నారు.

విమానాలకు ఫేక్ బెదిరింపు కాల్స్ - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారంటే?

ABP Southern Rising Summit 2024: ప్రస్తుతం విమానాలకు ఫేక్ బెదిరింపు కాల్స్ ఎక్కువవుతున్నాయని.. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల్లో భద్రత పెంచామని.. వ్యవస్థను మెరుగుపరచడానికి చట్టంలో మార్పులను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ప్రయాణికుడి భద్రతను నిర్ధారించడానికి ప్రోటోకాల్‌ను అనుసరించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 'విమానాలకు బెదిరింపు కాల్స్ అరికట్టేందుకు చట్టంలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించాం. ఇలాంటి కాల్స్ చేసిన వాళ్లని నో ఫ్లై లిస్టులో పెట్టాలని ప్రతిపాదించాం. ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నాం. విచారణ పూర్తయ్యేంత వరకూ ఇది కుట్ర అనేది తేల్చలేం.' అని పేర్కొన్నారు.


'మంజుమ్మల్ బాయ్స్' సినిమాలో ఆ గుహ నిజం కాదా? - డైరెక్టర్ చిదంబరం ఏం చెప్పారంటే?

ABP Southern Rising Summit 2024: మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలోని గుహ నిజమైనది కాదని, సెట్‌లోనే నిర్మించామని డైరెక్టర్ ఎస్.చిదంబరం వెల్లడించారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ తనను ఇంటికి ఆహ్వానించారని.. ఆ తర్వాత మంజుమ్మెల్ బాయ్స్‌తో కలిసి ఆయన ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఆయన చెప్పిన విశేషాల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.


 


హైదరాబాద్ అంటే అంతకు మించి - నటుడు మహ్మద్ అలీ బేగ్

ABP Southern Rising Summit 2024: హైదరాబాద్ అంటే ఛార్మినార్, బిర్యానీ మాత్రమే కాదని అంతకు మించి అని ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మహమ్మద్ అలీ బేగ్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. భాగ్యనగరం.. ఛార్మినార్, ముత్యాలు, బిర్యానీ కంటే గొప్పదని పేర్కొన్నారు. సాహిత్యం, ప్రదర్శన కళలను సముచిత ప్రేక్షకులకు మించి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.


 


భారతదేశంలో అది సులభం కాదు - దినేష్ విక్టర్

ABP Southern Rising Summit 2024: భారతదేశంలో మహిళలు తమ శని, ఆదివారాల్లో ఫ్రీగా గడపడం అంత సులభం కాదని.. ఇది అభినందనీయమని SIP అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO దినేష్ విక్టర్ అన్నారు. తమ సంస్థలో ఎక్కువ భాగం మహిళలే పని చేస్తున్నారని చెప్పారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు.



 
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ప్రముఖ గాయని బిందు సుబ్రమణ్యం అద్భుత ప్రదర్శన

ABP Southern Rising Summit 2024: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో  ప్రముఖ గాయని సుబ్రమణ్యం అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో బిందు సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి భజన అనంతరం 'బేబీ ఐయామ్ ఎ ఫూల్' పాటను ప్రదర్శించారు. అనంతరం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్ ద్వారా ప్రాచుర్యం పొందిన బెల్లా సియావో పాటను పాడారు. ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.


మీ డేటాపై మీ నిర్ణయమే ఫైనల్ - మ్యాప్ మైజెనోమ్ సీఈవో అను ఆచార్య

ABP Southern Rising Summit 2024: మీ జీనోమ్ పరీక్షల నుంచి వచ్చే డేటా పూర్తి ప్రైవేట్‌గా ఉంటుందని మ్యాప్ మైజెనోమ్ సీఈవో అను ఆచార్య స్పష్టం చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆమె పాల్గొన్నారు. మీ సొంత నిర్ణయంతో షేర్ చేస్తే తప్ప ఆ సమాచారం షేర్ కాదని అన్నారు. కొవిడ్ మహమ్మారి తర్వాత, ప్రజలు ఇప్పుడు తమ గురించి, తమ DNA గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

గళం విప్పితే జాతీయ వ్యతిరేకులుగా పరిగణిస్తారు - కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్

ABP Southern Rising Summit 2024: దేనిపై గళం విప్పినా మనల్ని జాతీయ వ్యతిరేకులుగా పరిగణిస్తారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

తెలంగాణలో ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ - బీజేపీ నేత రఘునందన్ రావు

ABP Southern Rising Summit 2024: తెలంగాణలో ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అని మెదక్ ఎంపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రానికి నిధుల కేటాయింపు వంటి స్థానిక సమస్యలను లేవనెత్తగలవని.. అయితే వాటిని ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

తెలుగు ప్రజల చరిత్ర, నేటి కాలానికి ఆధునిక లింక్ కూచిపూడి - ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ యామినీ రెడ్డి

ABP Southern Rising Summit 2024: తెలుగు ప్రజల చరిత్ర, నేటి కాలానికి మధ్య ఓ ఆధునిక లింక్ కూచిపూడి అని ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్, మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత యామినీ రెడ్డి అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'కూచిపూడి సరికొత్త రూపంలో తెలుగువారి వారసత్వానికి, చరిత్రకు, మనకున్న నేటి కాలానికి మధ్య ఆధునిక లింక్‌గా మారింది.' అని పేర్కొన్నారు.

'నా తర్వాత, నా బ్రాండ్ ముందుకు సాగుతుందనుకోను' - ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా

ABP Southern Rising Summit 2024: తన తర్వాత గౌరంగ్ షా బ్రాండ్ ముందుకు సాగుతుందని తాను అనుకోవట్లేదని.. ఎందుకంటే తనకు రెండో వ్యక్తి కనిపించలేదని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఖాదీ ఆధారిత పాఠశాల లేదా కార్యాలయ యూనిఫారాలను ప్రభుత్వమే తయారు చేయవచ్చని తెలిపారు. ప్రతి వాష్‌తో క్లాత్ నాణ్యత మెరుగుపడుతుందని.. కాబట్టి ఇది టెరీపాలిస్టర్ కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పారు.


 

ఛాంపియన్‌గా ఎదగాలంటే ప్లాన్ - ఎ మాత్రమే ఉండాలి - పుల్లెల గోపీచంద్

ABP Southern Rising Summit 2024: ఛాంపియన్‌గా ఎదగాలంటే ప్లాన్ - ఎ మాత్రమే ఉండాలని బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ అన్నారు. 'వ్యక్తి అభిరుచి, ఆసక్తి మీద మాత్రమే ఛాంపియన్ కావాలనేది ఆధారపడి ఉంటుంది. ప్రతీ సెకను మీరు అలా కావాలని కలలు కనాలి. మీరు అనుకున్నది సాధిస్తామని బలంగా నమ్మినప్పుడే అది సాధ్యం.' అని పేర్కొన్నారు.

ఒలింపిక్స్ నాకు సర్వస్వం కాదు - పుల్లెల గోపీచంద్

ABP Southern Rising Summit 2024: ఒలింపిక్స్ తనకు సర్వస్వం కాదని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. క్రీడలు జీవితాన్ని మార్చే విధానం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. 2001లో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచాక తానే గెలవగా లేనిది మిగతా వారు గెలవలేరా అనిపించిందని, అందుకే కోచింగ్‌ను ప్రారంభించానని అన్నారు. 

మీరు పని చేయలేకుంటే మీరు అసమర్థులు - టీడీపీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న

ABP Southern Rising Summit 2024: మీరు పని పూర్తి చేయలేకుంటే మీరు అసమర్థులని టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆమె మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను తీర్చిదిద్దడంలో కేంద్రం అడ్డంకిగా ఉందని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారని.. 'ఇతర సీఎంలు పనులు చేయగలిగితే మీరు ఎందుకు చేయలేరు?' అని ఆమె ప్రశ్నించారు.


 


ఒకే దేశం ఒకే ఎన్నికలను బలవంతం చేయలేం - డీఎంకే ఎంపీ డాక్టర్ కనిమొళి సోము

ABP Southern Rising Summit 2024: మనం భిన్నత్వంలో ఐక్యతతో ఉన్నామని, ఒక దేశం ఒకే ఎన్నికలను, ఒక మతాన్ని ఒకే భాషను బలవంతం చేయలేమని డీఎంకే ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ కనిమొళి సోము అన్నారు.


6 ఫ్లాప్స్ తర్వాత దేవుడు నాకు ఆ శక్తి ప్రసాదించాడు - సాయిదుర్గాతేజ్

ABP Southern Rising Summit 2024: తనకు ఆరు ఫ్లాప్స్ వచ్చాయని నటుడు సాయిదుర్గాతేజ్ అన్నారు. ఆ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏవైనా కథలు సరి కాకుంటే నో చెప్పే శక్తిని దేవుడు తనకు 6 ఫ్లాప్స్ తర్వాత ఇచ్చాడని ఎట్టకేలకు అర్థమైందని అన్నారు.



డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి - సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్

ABP Southern Rising Summit 2024: బైక్స్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ అన్నారు. అదే ప్రమాదం నుంచి తనను కాపాడిందని అన్నారు. ప్రమాదం తర్వాత కోలుకునేందుకు తనకు తన తల్లి పెద్ద మద్దతుగా నిలిచారని అన్నారు. 'ప్రమాదం తర్వాత గొంతుకు ఇబ్బందిగా మారింది. సరిగ్గా మాట్లాడలేకపోయాను. రాయడమూ కష్టంగా అనిపించింది' అని పేర్కొన్నారు.


వక్రీకరించిన చరిత్రకు సమాధానం అందులో లేదు - విక్రమ్ సంపత్

ABP Southern Rising Summit 2024: వక్రీకరించిన చరిత్రకు సమాధానం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో లేదని, అది కేవలం స్కాలర్‌షిప్‌ల ద్వారా మాత్రమేనని చరిత్రకారుడు విక్రమ్ సంపత్ అన్నారు. ప్రభుత్వం ఏమీ చేయనందున, ఈ దిశగా ప్రైవేట్‌గా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

'18వ శతాబ్దం గందరగోళం' - ప్రముఖ చరిత్రకారుడు విక్రమ్ సంపత్

ABP Southern Rising Summit 2024: 18వ శతాబ్దం అయోమయ శతాబ్దమని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ అన్నారు. నిజాంల వైఖరితో సహా అంతా గందరగోళంగా ఉందన్నారు. ఇతర నిజాంలపై పోరాడేందుకు బ్రిటీష్‌ పక్షాన నిలిచిన నిజాంలు ఆ తర్వాత వెనక్కి వెళ్లి బ్రిటీష్‌ వారిని విడిచిపెట్టిన తీరు గురించి ఆయన ప్రస్తావించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉన్న వారిని కలిసి పోరాటం సాగించారు.


 

ర్యాపిడో అందరికీ తెలుసు.. సహ వ్యవస్థాపకులు కాదు - అరవింద్ సంకా ఆసక్తికర వ్యాఖ్యలు

ABP Southern Rising Summit 2024: నేడు ర్యాపిడో సంస్థ అందరికీ తెలుసని.. సహ వ్యవస్థాపకులు కాదని సంస్థ కో ఫౌండర్ అరవింద్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా చాలా ప్రయోజనకరమని.. అయితే తాను దాన్ని ఉపయోగించనని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉత్పాదకత పెంచుతుందని.. అయితే దానినే ప్రాముఖ్యంగా చూడొద్దని అన్నారు.

అదే ర్యాపిడో సంస్థ ప్రత్యేకత - ర్యాపిడో సహ వ్యవస్థాపకులు అరవింద్

ABP Southern Rising Summit 2024: బైక్ టాక్సీ అగ్రిగేటర్ యాప్ ర్యాపిడో ప్లాట్‌ఫారమ్‌లో 20 లక్షల మంది డ్రైవర్లు పనిచేస్తున్నారని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు అరవింద్ చెప్పారు. స్థానికంగా ఉపాధిని సృష్టించడం ద్వారా నిరంతర అభివృద్ధి, ప్రేరణ పొందుతుందని అన్నారు. డ్రైవర్ల నుంచి ర్యాపిడో ఎలాంటి కమీషన్ తీసుకోకపోవడమే సంస్థ ప్రత్యేకత అని అన్నారు.

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నా వారి పార్టీ కార్యకర్తలే నాకు మద్దతిచ్చారు - సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని.. అయితే వారి పార్టీ ఎమ్మెల్యే తనకు మద్దతుగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కారును పడగొట్టాలని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు.


 

గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ అభివృద్ధి చేస్తాం - ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ABP Southern Rising Summit 2024: అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ఆయన కీలక ప్రకటన చేశారు. 'ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. పటేల్ విగ్రహంలా... బాపూ ఘాట్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్  అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం. దీన్ని బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి?.' అని రేవంత్ నిలదీశారు.

తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంటోంది - సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: తెలంగాణలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం వ్యతిరేకిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది విధ్వంసక శక్తి కాకూడదని కేంద్రానికి సూచించారు.

దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉంటారా.? - సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్యాలెస్‌ పాలిటిక్స్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉన్నారా..? ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రజల తరఫున గొంతుక వినిపించలేదు. ప్రజాస్వామ్యంపై అసలు ఆయనకు నమ్మకం ఉందా..? కేసీఆర్ తనని తాను ఓ జమీందార్ అనుకుంటున్నారు. ఇలాంటి జమీందార్లని ప్రజలు ఎక్కువ రోజులు సహించరు. మోదీకి, కేసీఆర్‌కి నేను ఒకటే మాట చెబుతున్నా. వచ్చి మాతో మాట్లాడండి. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి బయటకు రాకండి. మిగతాది ప్రజలు చూసుకుంటారు.' అని రేవంత్ అన్నారు.

కేంద్రానికి రూపాయి పంపిస్తే 40 పైసలు పంపిస్తోంది - సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: 'కేంద్ర ప్రభుత్వానికి మేం ఓ రూపాయి పంపిస్తే..మాకు 40  పైసలు పంపిస్తోంది. అదే యూపీ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే  రూ.7 వెనక్కి వస్తున్నాయి. బిహార్‌కి రూ.6 వస్తున్నాయి. నార్త్ కన్నా సౌత్ ఇండియా నుంచే కేంద్రానికి ఎక్కువ ట్యాక్స్ వెళ్తోంది. అయినా..రిటర్న్‌గా వచ్చేది మాత్రం తక్కువే. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నాయి. కానీ..కేంద్రం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ప్రధాని మోదీ ఉత్తరాదికి చెందిన వ్యక్తి. అందుకే..అన్నీ ఆ ప్రాంతానికే ఇస్తున్నారు.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాజీవ్ గాంధీ టెలికాం, కంప్యూటర్ రంగాల్లో విప్లవం తీసుకొచ్చారు - సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: 'రాజీవ్ గాంధీ కంప్యూటర్‌, టెలికాం రంగాల్లో విప్లవం తీసుకొచ్చారు. ఈ కారణంగానే ఇవాళ ఏబీపీ నెట్‌వర్క్‌ లాంటి జాతీయ మీడియా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ నేలకి చెందిన పీవీ నరసింహారావు రైజింగ్‌ ఇండియా అనే స్టేటస్‌ని భారత్‌కి ఇచ్చారు. ఎల్‌పీజీ ద్వారా భారత్‌ని శక్తిమంతంగా మార్చారు.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

పన్నులు ఎక్కువ చెల్లిస్తున్నా తిరిగి పొందడం లేదు - సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: దక్షిణ భారతదేశం మొత్తం ఉత్తర భారతదేశం కంటే చాలా ఎక్కువ పన్నులు చెల్లిస్తోందని, ఇంకా పెద్దగా తిరిగి పొందడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే పన్నులపై ఎక్కువ రాబడిని పొందే వివక్ష గురించి ఆయన మాట్లాడారు.


 

దక్షిణ భారతదేశంపై కేంద్రం చిన్నచూపు - సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: దక్షిణ భారతదేశంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంపై ప్రధాని మోదీ అందించిన సహకారం తక్కువని ఆరోపించారు. దక్షిణాదికి కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి ఓటర్ల ఓట్లు కావాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు.

పదేళ్ల తెలంగాణకు సదరన్ రైజింగ్ సమ్మిట్ ఓ ప్రతీక - ఏబీపీ నెట్ వర్క్ డైరెక్టర్ ధ్రుబా ముఖర్జీ

ABP Southern Rising Summit 2024: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024ను ప్రారంభించారు. అనంతరం ఏబీపీ నెట్‌వర్క్ డైరెక్టర్ ధూర్భా ముఖర్జీ కీలక ప్రసంగం చేశారు. తల్లి ఒడిలో అప్పుడే పుట్టిన బిడ్డతో సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను పోల్చారు. 'దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటకలో ఎక్కువ అభివృద్ధి కనిపిస్తోంది. సదరన్ రైజింగ్ సమ్మిట్ హైదరాబాద్‌లో నిర్వహించడానికి కారణం ఇదే. పదేళ్ల తెలంగాణకు ఈ సదస్సు ఓ ప్రతీకగా భావిస్తున్నాం. ఏబీపీ నెట్‌వర్క్‌ది వందేళ్ల చరిత్ర. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఏబీపీ దేశంపై అందరూ చూపిస్తోన్న అభిమానానికి ధన్యవాదాలు.' అని పేర్కొన్నారు.

ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం - ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: హైదరాబాద్ వేదికగా 'ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్' ప్రారంభమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. 'Coming of Age: Identity, Inspiration, Impact' అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో  కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. సదస్సులో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు.

మరికాసేపట్లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం - ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో  కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. సౌతిండియా నుంచి అగ్రశ్రేణి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయతలు, వ్యాపారులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరిస్తారు.

మరికాసేపట్లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం - ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ABP Southern Rising Summit 2024: దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నిర్వహిస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ ప్రగతిలో దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్ సదరన్ రైజింగ్ సదస్సు హైదరాబాద్‌లో శుక్రవారం మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

Background

ABP Southern Rising Summit 2024 Live Updates: దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నిర్వహిస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ ప్రగతిలో దక్షిణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్ సదరన్ రైజింగ్ సదస్సు హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో దక్షిణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో  కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు దేశ అభివృద్ధి, ప్రగతిలో దక్షిణ భారత ప్రాధాన్యతను అందులో ఈ వ్యక్తుల పాత్రను ఆవిష్కరిస్తుంది. "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జాతీయ కోణంలో దక్షిణాది ప్రాధాన్యతను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించనుంది. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అంశాల ప్రముఖులు తమ ఆలోచనలు పంచుకుంటారు. 


సదస్సులో పాల్గొనే ప్రముఖులు వీరే


సౌతిండియా నుంచి అగ్రశ్రేణి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయతలు, వ్యాపారులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరిస్తారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు. ఇండియన్ బాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, స్టార్ హీరో సాయి దుర్గా తేజ్, నటి రాశీఖన్నా, జాతీయ నటుడు ప్రకాష్ రాజ్, మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు, రచయిత చిదంబరం, వెటరన్ యాక్టర్ గౌతమి వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. 


అటు, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. రాజకీయ రంగంలో దక్షిణాది నుంచి తమదైన ముద్ర వేసిన యువనేతలు సదస్సుకు హాజరవుతున్నారు. బీజేపీ నేత కొంపెల్ల మాధవి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిది డాక్టర్ షామా మహమ్మద్, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్, బీజేపీ ఎంపీ రఘునందన్ వంటి వారు కూడా దక్షిణాది రాజకీయ రంగం భవిష్యత్‌లో దేశంలో పోషించబోతున్న పాత్రపై తమ విశ్లేషణను అందిస్తారు. అలాగే సాంస్కృతిక రంగం నుంచి క్లాసికల్ సింగర్ బిందు సుబ్రహ్మణ్యం, అవార్డు విన్నింగ్ సింగల్ శిల్పారావు, క్లాసికల్ డ్యాన్సర్, మూడుసార్లు జాతీయ అవార్డు పొందిన యామినిరెడ్డి దక్షిణాది కల్చర్ హెరిటేజ్‌ను హైలెట్ చేస్తారు. అదే సమయంలో దక్షిణాది భవిష్యత్‌లో ఎలా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందో రచయిత, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ చర్చిస్తారు. అలాగే, స్టార్టప్‌ల్లో తనదైన ముద్ర వేసిన రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా.. యువత మరింత వేగంగా వ్యాపార రంగంలో రాణించడానికి ఎలాంటి పాలసీలు అవసరమో... ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చో అన్న అంశాలపై తన అభిప్రాయాలు పంచుకుంటారు.


అన్ని రంగాల్లోనూ దక్షిణాది పాత్రను చాటేలా 'సదరన్ రైజింగ్ సమ్మిట్' జరగనుంది. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రను సెలబ్రేట్ చేసుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.