Adilabad News: గుస్సాడీ నృత్యాన్ని విస్తృత పరిచిన 94ఏళ్ల పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గిరిజన బిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్యంతో  కనకరాజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సొంతూరు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని  జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామం. ఈయన గత కొంత కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో చూపించిన ప్రయోజనం లేకపోయింది. 


గుస్సాడీ నృత్యాన్ని కాపాడుతూ వచ్చిన వ్యక్తిగా పేరు ఉన్న కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును నవంబర్‌ 9న అందుకున్నారు. వందల మంది యువకులు ఆయన వద్ద గుస్సాడీ నృత్యం నేర్చుకొని శిష్యులుగా మారారు. 


గిరిజన బిడ్డలకు ఎంతో ఇష్టమైన గుస్సాడీ నృత్యానికి వన్నెత తేవడమే కాకుండా పద్మశ్రీ అందుకొని తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచిన కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తామని ప్రకటించారు. 










కనకరాజు అద్భుతమైన నృత్యకారుడు సాంస్కృతిక దిగ్గజం అని ప్రధానమంత్రి కొనియాడారు. అలాంటి వ్యక్తి మరణించినందుకు విచారం వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించడంలో ఆయన అందించిన గొప్ప సహకారం రాబోయే తరాలను ఎల్లప్పుడూ చైతన్యవంతం చేస్తుందన్నారు. ఆయన అంకితభావం, అభిరుచి సాంస్కృతిక వారసత్వం ముఖ్యమైన అంశాలు వాటి ప్రామాణికమైన రూపంలో వృద్ధి చెందేలా చూసిందని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ప్రధానమంత్రి.






గిరిజన సాంప్రదాయ నృత్యమైన ‘గుస్సాడి’కి ప్రత్యేక గుర్తింపు తీసుకుకొచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఇకలేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలోని మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ కుమురం భీం జిల్లా నుంచి వచ్చి.. గుస్సాడికి గుర్తింపు తీసుకురావడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన కనకరాజు మృతి తెలంగాణకు మరీ ముఖ్యంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీరని లోటుగా అభివర్ణిచంచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, గిరిజన సమాజానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.


కనకరాజు మృతికి బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇతర నేతలు తీవ్ర సంతాపం తెలియజేశారు. కనకరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎర్రకోటపై నృత్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని తెలియజేశారని అన్నారు కేటీఆర్.