Karimnagar Govt Hospital News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఉండే లక్షల మంది ప్రజలకు ఏకైక ప్రధాన ఆసుపత్రి కరీంనగర్ సివిల్ ఆసుపత్రి. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తీవ్రతను బట్టి ఆయా ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. కడుపునొప్పి, జ్వరాలు, చెవి నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పులు లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేస్తారు.  ఏదైనా ప్రమాదం జరిగి తలకు గాయాలైనా గుండె సంబంధిత సమస్య వచ్చినా మూత్రపిండాల సమస్య వచ్చి పరిస్థితి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం జిల్లా ప్రధాన ఆసుపత్రికి వెళ్లాల్సిందే.


కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సివిల్ ఆసుపత్రి 500 పడకల సామర్ధ్యం కలిగిన ప్రధాన ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో జరిగే వైద్యం గురించి చెప్పుకుంటే భయం కలుగుతుంది. జిల్లాలోని వారికి ఏదైనా సీరియస్ కండిషన్‌లో ఉండి ఆసుపత్రికి వచ్చారంటే అంతే సంగతి. చెప్పుకోవడానికి కరీంనగర్ జిల్లాకు ప్రధాన ఆసుపత్రి కానీ కావలసినంత మంది వైద్య సిబ్బంది లేరు. వచ్చే పేషెంట్లకు వైద్య సేవలు సరిగా దొరకడం లేదు. సీరియస్ కండీషన్‌లో ఇక్కడకు వస్తే ప్రాణాలు గాల్లో దీపం పెట్టినట్టే ఉంటుంది. 


ప్రధాన వైద్య సేవలు కరవు...
ఏదైనా క్రిటికల్ పరిస్థితిలో న్యూరో సంబంధిత సమల్యలతో పేషంట్స్ వస్తే న్యూరో డాక్టర్ లేరు. మూత్ర పిండాల సమస్యతో వస్తే నెఫ్రాలజీ డాక్టర్ కనిపించరు. గుండె సంబంధిత సమస్య వచ్చినా కార్డియాలజీ విభాగం లేదు. మరి ఇలాంటి ప్రధాన సమస్యలతో వచ్చిన వారిని వరంగల్‌లో ఎంజీఎం ఆసుపత్రికో లేక హైదరాబాద్‌కో పంపించాల్సి పరిస్థితి. ఒక వేళ రోగి పరిస్థితి విషమంగా ఉంటే అంతే నూకలు చెల్లినట్టే.




స్కానింగ్ టెస్టులకు టెక్నీషియన్స్ కొరత...
కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేసే పరికరం ఏళ్ల కింద అమర్చారు. కానీ అక్కడ ఎవరైనా స్కానింగ్ కోసం వస్తే పరికరం చెడిపోయిందనే సమాధానం చెప్తారు. దానితో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో చేయించుకోవాల్సిన పరిస్థితి. స్కానింగ్ చేసేవారు లేక ఆ పరికరం వృథాగా పడి ఉంది. 2D స్కానింగ్ పరికరం కూడా ఉంది. దాని పరిస్థితి కూడా అదే. 




ప్రైవేట్ సేవలపై ఆసక్తి...
హాస్పిటల్ హబ్‌గా పేరుగాంచిన కరీంనగర్‌లో వందల మంది వైద్యులు ఉన్నారు. అందరూ ప్రైవేట్ వైద్య సేవలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని ప్రభుత్వం ఆసుపత్రిలో వారి సేవలు అందించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు కూడా సొంత క్లినిక్స్‌పై ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిపై లేదనే విమర్శలు ఉన్నాయి.




కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఏమన్నారంటే..
కరీంనగర్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 500 పడకలు ఉన్నాయి. నిత్యం రోగులతో కిటకిటలాడే ఈ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు సరిపడా వైద్యులు లేరని అంటున్నారు. వైద్యులతోపాటు సిబ్బంది కొరత ఉందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో వచ్చే పేషంట్లను సరైన వైద్యులు లేకపోవడంతో వరంగల్ ఎంజీఎంకి లేక హైదరాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని అన్నారు. అయితే ఎలాంటి సమయంలోనైనా తాము వైద్య సేవలు అందించడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ వైద్యులు కొరతతో వైద్యం అందించలేకపోతున్నమని అన్నారు. ఐతే ఈ విషయం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వీరారెడ్డి ABP దేశంతో అన్నారు.