Telangana News | ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా నలుమూలల నుండి రైతులు తాము కష్టపడి సాగుచేసిన పత్తి పంటను తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పంట అంతంత మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టిందానికంటే దిగుబడి చాలా తక్కువగా వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల వరకు పత్తి సాగయింది. అయితే అందులో ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పంట తీవ్రంగా నష్టపోయింది. సాగుచేసిన పత్తి పంట చేతికొచ్చిన సమయంలో ప్రస్తుతం అయితే కొంత మాత్రమే దిగుబడి వచ్చేలా కనిపిస్తుందని రైతులు భావిస్తున్నారు.
తేమ శాతం అంటూ కొర్రీలు
చేతికొచ్చిన పంటను మార్కెట్లో అమ్ముదామంటే సీసీఐ మద్దతు ధర రూ.7521 ఉంటే, ప్రైవేటు వ్యాపారుల ధర రూ.7030 ఉంది. అందులోనూ తేమశాతం కొర్రీలు పెడుతూ ధరను తగ్గిస్తున్నారు. అసలే చలికాలం తేమ వాతావరణంలోనే కొంతమేర ఉంటుంది. దీంతో పత్తిని ఎండబెట్టి కుప్పచేసి మార్కెట్ కు తీసుకొచ్చిన తేమశాతం ఎక్కువగా చూపెట్టడం అర్థం కావడం లేదన్నారు. మూడు నాలుగు చోట్ల తేమశాతం ఒక్కోరకంగా వస్తుందన్నారు. అలాంటి తరుణంలో రైతులను నట్టేట ముంచడం ఎలా అని రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీని మార్కెట్ యార్డులోని గోదాము హాలులో పత్తిని ఎండబెట్టి తిరిగి కాంట వద్దకు తీసుకువచ్చి పరిశీలించిన తేమశాతం అలాగే ఉంటుందంటున్నారు. వర్షాకాలంలో విత్తనం పెట్టీ మొలకెత్తిన మొక్కలను కాపాడుతూ మందులు కొడుతూ పంట చేతికొచ్ఛాక.. కష్టపడి సాగు చేసిన పంటను మార్కెట్లో అమ్ముదాం అంటే పెట్టిన పెట్టుబడి కూడా సరిగా తమకు దక్కడం లేదంటూ రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయాలు
వ్యవసాయ రంగం అంటే ఎంతో మక్కువగా చూపించే వారు.. కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల వ్యవసాయం చేయాలంటే బాధగా ఉందని పలువురు రైతులు ఏబీపీ దేశంతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మార్కెట్లో పంటను తీసుకొచ్చి అమ్ముదామన్నా.. పట్టా పాస్ పుస్తకం.. ఆధార్ కార్డు రెండు తీసుకొచ్చినప్పటికిని పట్టా పాస్బుక్ ఉన్న రైతే ముంగట కనపడాలి అంటే ఎలా..? వృద్ధులు ఉంటారు.. వికలాంగులు ఉంటారు.. అనారోగ్యంతో ఉన్నవారు ఉంటారు.. మహిళలు ఉంటారు.. అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మార్కెట్ కు రాలేకపోవచ్చు.. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద తరచూ ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 8నుంచీ 12 శాతం తేమ ఉంటేనే సిసిఐ కోనుగోలు జరుగుతుంది. లేకుంటే కోనుగోలు చెయడం లేదని, తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొవాల్సి వస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా మార్కెట్లో పత్తి అమ్మకాలు చేస్తున్నప్పటికిని, తరుచూ మార్కెట్లో ఏదో రకమైన సాకులు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తూ రైతన్నల నడ్డి విరుస్తున్నారన్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలను పరిశీలించారు. మాయిశ్చర్ విధానాన్ని పరిశీలించారు రైతులు చెబుతున్న వారి గోడును విని పరిస్థితులను తెలుసుకొని రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిసిఐ మార్కెటింగ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశం పత్తి కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ ను వివరణ కోరగా ఆయన ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. సీసీఐ కేంద్రంలో ముఖ్యంగా రైతులు వారి కుటుంబంలో రక్త సంబంధీకులు ఎవరైనా వచ్చి కొనుగోలు చేయవచ్చునని, ఉదాహరణకు లిస్టులో భార్య పేరు ఉంటే భర్త వచ్చి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందనీ, తల్లి పేరు మీద ఉంటే కుమారుడు కూడా వచ్చి కొనుగోలు చేసుకోవచ్చని, దీనితో పాటు కౌలు రైతులకు కౌలు రైతు పహాని ఇవ్వడం జరుగుతుందనీ, కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. తేమశాతం గురించి కొందరు రైతులు చెప్పారు వాటిని కూడా పరిశీలించడం జరిగిందన్నారు.
అయితే ఎవరైనా తేమశాతం ఎక్కువ వస్తే మార్కెట్ యార్డ్ లోని గోదాము హాలులో పత్తి పంటను ఎండబెట్టుకొని తర్వాత వచ్చి మళ్లీ యధావిధిగా కొనుగోలు కేంద్రం వద్ద అమ్ముకోవచ్చు అన్నారు. ఎవరి పంటకు వారే బాధ్యులుగా అక్కడే ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం సిసిఐ లో 1253 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతుల పత్తినీ ఆరబెట్టి కోనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని, జనవరి ఫిబ్రవరి వరకు కూడా కొనుగోలు కేంద్రం ఉంటుందన్నారు. సిసిఐ గాని అగ్రికల్చర్ అధికారులు మార్కెట్ అధికారులు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని, ఏమైన సందేహాలు ఉంటే కోనుగోలు కేంద్రంలో ఫ్లెక్సీలో కంట్రోల్ నెంబర్స్ ఏర్పాటు చేయడం జరిగిందనీ వారికి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు.
జిల్లాలో మొత్తం 11 సీసీఐ కేంద్రాల ఏర్పాటు
పత్తి కొనుగోళ్ళు ఈ ఏడాది ఎలా ఉన్నాయి. మార్కెట్ యార్డులో ఇప్పటివరకు ఎంత మేరా కొనుగోలు జరిగాయి. ఈ ఏడాది ఎంతవరకు పత్తి పంట కొనుగోళ్ళు జరగవచ్చు అనే అంశాలపై ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్ ను ఏబీపీ దేశం వివరణ కోరగా... ఏబీపీ దేశంతో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ అనుసారంగా నాలుగున్నర లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అయిందని, ప్రస్తుతం పత్తిని ఇప్పుడిప్పుడే రైతులు మార్కెట్ కూ తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో మార్కెట్ కు వస్తుందన్నారు. సుమారుగా 32 లక్షల క్వింటాళ్ల పత్తి రావచ్చని అంచనా వేస్తున్నారు. పత్తి కొనుగోలు కోసం జిల్లాలో మొత్తం 11 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Also Read: Telangana Politics: ముఖ్య నేతల ఢిల్లీ టూర్లు పూర్తి - ఇక తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయా ?
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో అక్టోబర్ 26 నుండి కొనుగోలు ప్రారంభమయ్యాయని, ఈ మార్కెట్ యార్డులో రోజు పంట కొనుగోలు గురించి ప్రైవేటు పరంగా పాట పాడుతూ.. 8నుంచీ12 తేమశాతం ఉంటేనే అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. MSP ధర కల్పించి కొనుగోళ్ళు చేస్తున్నారన్నారు. జిల్లాలో 31 జిన్నింగ్ ఫ్యాక్టరీలలో పత్తి కొనుగోళ్ళు కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్కెట్ యార్డులో ఇప్పటివరకు 2487 మంది రైతుల నుంచి 50,072 క్వింటాళ్ల పత్తిని కోనుగోలు చెయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 9893 మంది రైతుల నుంచి 58,368 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
అత్యంత నాణ్యత కలిగిన పత్తి
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి ఎలా ఉంది. పత్తి రైతులు ఏమంటున్నారు. కొనుగోళ్ళు ఎలా సాగుతున్నాయి. రైతులకు మద్దతు ధర వస్తుందా అని అంశాలపై రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగేపు బొర్రన్న ఏబిపీ దేశంతో మాట్లాడారు.. ఆదిలాబాద్ జిల్లాలో చాల వరకూ వర్షాధారపు పంటలపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువగా ఉన్నారన్నారు. జిల్లాలో 4:30 లక్షల ఎకరాలలో పత్తిని సాగు చేశారన్నారు. చిరపుంజి కంటే ఎక్కువగా వర్షపాతం ఆదిలాబాద్ జిల్లాలో నమోదయింది అన్నారు. ఆసియా ఖండంలోనే అత్యంత నాణ్యత కలిగిన పుంజపు పొడవు కలిగిన పత్తి ఆదిలాబాద్ జిల్లాలోనే దొరుకుతుందన్నారు.
ఈ ఏడాది జులై ఆగస్టు నెలలో భారీ వర్షాల కారణంగా రైతులు నష్టపోయారన్నారు. మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట బీమా తీసేయడం వల్ల రైతులను ఆదుకునే వారు లేక ఆర్థిక భారం వెసులుబాటు లేకుండా పొయిందన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద 8 నుంచి 12% తేమ ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు.. లేకుంటే ప్రైవేటు వ్యాపారుల వద్దనే రైతులు అమ్మకాలు చేసి నష్టపోతున్నారన్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,22,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగితే 73,000 వేల క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల వారే కొనుగోలు చేశారన్నారు. ఇక్కడున్న సీసీఐ కేంద్రాలు ఒకటిలో మూడోవంతుగా ఉన్నాయన్నారు. సీసీఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు అంతా సిండికేట్ గా ఏర్పడి కుమ్మక్కయ్యారన్నారు. అందరూ కలిసి రైతులను నష్టపరుస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టీ రైతులకు సీసీఐ ద్వారా కనీస మద్దతు ధర వచ్చేలాగా న్యాయం చేయాలని కోరుతున్నారు.