BRS Ex MLA Patnam Narender Reddy is Prime Accused in Lagcherla incident says Police వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్ సహా పోలీస్ ఉన్నతాధికారులపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. కేటీఆర్ ఆదేశానుసారం పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై దాడికి ప్లాన్ చేశారన్నది తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఫార్మా భూములకు సంబంధించి అధికారులు పెట్టనున్న గ్రామసభలో గొడవ చేయాలని బోగమాని సురేశ్ కు పట్నం నరేందర్ రెడ్డి బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని పేర్కొన్నారు. అవసరమైతే అధికారులను చంపేందుకు సైతం వెనుకాడకూడదని నిందితులకు ఆదేశాలు వెళ్లినట్లు పోలీసులు సంచలన విషయాల్ని రిపోర్టులో వెల్లడించారు.




అవసరమైతే చంపేందుకు సైతం రెడీ!


దాడికి సంబంధించి మనుషులను అరేంజ్ చేయించటం, కర్రలు, కరంపొడి, రాళ్లు ఇలా ప్రతీ ఒక్కటి అటు ఆర్థికంగా, ఇటు మనుషులను అరేంజ్ చేసేందుకు సురేశ్ కు పట్నం నరేందర్ రెడ్డి సహకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. హకీంపేట్, పోలేపల్లి, రోటి బండ తండా, పులిచర్ల తండా, లగచర్ల గ్రామాల రైతులను తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా న‌రేందర్‌రెడ్డి రెచ్చ‌గొట్టినట్లు పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వ అధికారులను చంపేందుకు కూడా వెనుకాడాల్సిన అవసరం లేదని తేలిందని పోలీసులు రాశారు. తద్వారా ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనేది అసలు కుట్ర. ఇందుకు పార్టీకి సంబంధించిన కీలక నేత నుంచి ఆదేశాలు సహాయ సహకారాలు ఉంటాయని.. రేపు ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనే చూసుకుంటారని హామీ కూడా వచ్చినట్లు సంచలన విషయాలు వెల్లడి అయ్యారు. ఆ కీలక నేత కేటీఆరే నంటూ పోలీసులు పేరును సైతం రాశారు. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్ డీటీసీ కి తరలించిన తర్వాత చేసిన విచారణలో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిపారు. 


మరోవైపు ఏ2గా ఉన్న బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్ కలెక్టరేట్లో ఐజీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. 


Also Read: KTR News: పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్, కొండగల్ నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతామంటూ ఫైర్


ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. లగచర్ల దాడి ఘటనలో మొత్తం 47 మందిని గుర్తించాం. ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉంది. మిగతా వాళ్ల కోసం నాలుగు టీములతో గాలిస్తున్నాం. 21 మందిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించాం. పట్నం నరేందర్ రెడ్డి, విట్టల్, దేవదాస్, గోపాల్ నాయక్, సురేష్, రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులు. 42 మందిని పోలీసులు ప్రాథమికంగా విచారించగా అందులో 19 మందికి భూమి లేదని తేలింది. అంటే ఏ సంబంధం లేకుండానే వారు లగచర్ల దాడి ఘటనలో పాల్గొన్నారు. కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కలెక్టర్, పోలీస్ అధికారులపై దాడి చేశారు. 




దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం
లగచర్లలో జరిగిన దాడిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశాం. గురువారం నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వడంపై కోర్టులో వాదనలు జరుగుతాయి. ఈ కేసులో మొదట ఏ1గా ఉన్న సురేష్ ను ఏ2గా మార్చాం. పూర్తి ఆధారాలు దొరకడంతోనే నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి ప్రధాన కుట్రధారుగా నరేందర్ రెడ్డిగా గుర్తించడంతో లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ నేతను ఏ1గా మార్చాం. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి చేశారు. ఈ దాడిలో సురేష్ కీలక పాత్ర పోషించాడు - ఐజీ సత్యనారాయణ