Patnam Narendar Reddy Arrest News | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతాం, బీఆర్ఎస్ నేతలు మొత్తం కొడంగల్ వెళ్తామని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలు చేస్తుందంటూ మండిపడ్డారు. కొడంగల్ లో ఫార్మా విలేజ్ ను ముందు నుంచే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు రైతులను తన్ని తీసుకుంటామని బెదిరించిన ఆడియో ఉంది. ఫార్మా విలేజ్ వద్దని కొడంగల్ రైతులు సీఎం రేవంత్ రెడ్డిని, బీజేపీ నేతల్ని కలిసి సమస్య వివరించారు. 


ఈరోజు కొడంగల్ ఇలా రగలుతుండటానికి రేవంత్ రెడ్డి ఆనాలోచిత నిర్ణయాలే కారణం. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఈ ప్రభుత్వం తీరు ఉంది. సొంత నియోజకవర్గం కొడంగల్ రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ జాతీయ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నాడు. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేశారు. ఆయనేమైనా బందిపోటా? అలా తీసుకెళ్లే అవసరం ఏముంది. భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీల భూములు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులకు ఆ భూములు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


తనపై ఎలాంటి దాడి జరగలేదని వికారాబాద్ కలెక్టర్ స్వయంగా చెప్పారు. కానీ కలెక్టర్ పై దాడి అని కాంగ్రెస్ నేతలు హడావుడి చేసి, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ని అరెస్ట్ చేశారు. రైతులను లాక్కొని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. తన అల్లుడికి చెందిన మ్యాక్స్ బీఎన్ కంపెనీ విస్తరణ కోసమే సీఎం వంత్ రెడ్డి రైతుల భూములను తీసుకుంటున్నారు. మెడికవర్ హాస్పిటల్ ఓవర్ అన్నం శరతే. ఆయన అల్లుడు, రేవంత్ రెడ్డి అల్లుడు ఒకే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారు. వారి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. 



Also Read: Lagacharla Attack Case: బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు- లగచర్ల అధికారులపై దాడి కేసులో భారీ ట్విస్ట్


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుటుంబసభ్యులను కేటీఆర్ పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. చట్టపరంగా న్యాయపోరాటం చేద్దామని, పార్టీ నరేందర్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, ఎంపీ డీకే అరుణ ఆ గ్రామానికి వెళ్తుంటే ఆమెను సైతం అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. కానీ వార్డు మెంబర్ కూడా కాకపోయినా, సీఎం రేవంత్ రెడ్డి అన్న అనే కారణంగా తిరుపతి రెడ్డిని మాత్రం లగచర్లకు 300 మందితో వెళ్లనిచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.


భూములు ఇస్తేనే మీ వాళ్లను విడుదలచేస్తామంటూ రైతుల ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూమి కోల్పోతామని బాధపడుతున్న వారిని జైళ్లలో పెట్టి చిత్రహింసలు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు.  తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేసే తగ్లక్ పనులను జాతీయ స్థాయిలో బహిర్గతం చేసి వారిపై చర్యలు తీసుకునేందుకు పోరాటం చేస్తామన్నారు కేటీఆర్.