Kodangal News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో అధికారులపై దాడి చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఉన్న అనుమానిస్తున్న పోలీసులు ఆయన్ని ఈ ఉదయం అరెస్టు చేశారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన నరేందర్ రెడ్డిని ఫిలింనగర్‌లో అరెస్టు చేశారు. 


ఫిలింనగర్ సమీపంలో ఉన్న కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లి వస్తున్న పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ టైంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆయన అరెస్టును చుట్టూ ఉన్న అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులకు అనుచరులకు మధ్య కాసేపు తీవ్ర తోపులాట జరిగింది. 


విచారణ- అరెస్టులు


వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ టైంలో జిల్లా అధికారులను పథకం ప్రకారం పిలిచి దాడి చేశారని సురేష్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి సురేష్ పరారీలో ఉన్నారు. అయితే కేసు విచారణలో భాగంగా సురేష్ ఫోన్ కాల్ లిస్టు చూసిన అధికారులు కీలక అంశాలను గుర్తించారు. 


సురేష్‌- పట్నం నరేందర్ మధ్య సంభాషణ


గత కొన్ని రోజులుగా సురేష్ అనే వ్యక్తి పదే పదే పట్నం నరేందర్‌రెడ్డికి ఫోన్ చేసిన విషయాన్ని గుర్తించారు. మంగళవారం నుంచి ఈవిషయంలోనే పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కూడా సురేష్ తమ కార్యకర్తేనంటూ ఒప్పుకున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు కారణంగా తన ఏడు ఎకరాలు పోతుందనే బాధలో ఉన్నాడని వివరించారు. 


అక్కడ ప్రజలందరితో కలిసి సురేష్ కూడా ప్రజాభిప్రాయాన్ని బహిష్కరించడానికి పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ బహిష్కరించిన వారిలో అన్ని పార్టీల వాళ్లు ఉన్నారని కానీ పోలీసులు కేవలం బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. 


అధికారులను పిలిచిన సురేష్‌పై అనుమానం


సురేష్‌లాంటి కీలకమైన కార్యకర్తలు ఏన్నో సమస్యల చెప్పుకునేందుకు తరచూ ఫోన్ చేస్తుంటారని పట్నం నరేందర్ రెడ్డి వివరించారు. అంతమాత్రాన కుట్ర చేసినట్టు ఎలా అవుతుందని అన్నారు. ప్రభుత్వం కావాలనే ఇందులో బీఆర్‌ఎస్ నేతలను శ్రేణులను ఇరికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అక్కడ ప్రజలు చాలా కాలంగా తమ గోడు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వినిపించుకోలేదన్నారు. 


లగచర్ల ప్రాంతంలో కొనసాగుతున్న ఆంక్షలు 


ఇప్పటికే 50 మందికిపైగా వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అరెస్టు చేసిన వారిలో కొందర్ని రిమాండ్‌కు తరలించారు. మిగతా వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచి పెట్టారు. లగచర్లతోపాటు దుద్యాల, కొడంగల్‌, బొంరాస్‌పేట్‌ మండలాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంటర్‌నెట్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. 


Also Read: ముఖ్య నేతల ఢిల్లీ టూర్లు పూర్తి - ఇక తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయా ?