ప్రశ్న.. చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ, ప్రత్యేకతలేంటి..?
శ్రీధర్ , సిపిఆర్ ఓ, దక్షిణ మధ్య రైల్వే..
మోడ్రన్ హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ను 430 కోట్ల రూపాయలతో నిర్మించాము. ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ ఫామ్స్ ను 9 ప్లాట్ ఫామ్స్ గా విస్తరించాము. 9 రైల్వే ట్రాక్స్ ను 19 గా చేశాం. 9 లిప్టులు, 5 ఎస్కలేటర్లు, భారీ స్దాయిలో పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్స్, రెస్ట్ రూమ్స్ ,సెంట్రలైజ్డ్ ఏసి, వీటితోపాటు నాలుగు పిట్ లైన్లు ఏర్పాటు చేశాం. ఈ పిట్ లైన్స్ లోనే ఏకకాలంలో నాలుగు రైళ్లు క్లీనింగ్ అండ్ రిపేరింగ్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఓవర్ హార్డ్ వేర్ షెడ్స్ (ఐఓహెచ్ ) రెండు నిర్మించాం. రైలు కోచ్ లో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే ఆ కొచ్ ను రైలు నుండి తొలిగించి, ఈ ఐఓహెచ్ తీసుకొచ్చి అక్కడ రిపేర్ చేస్తారు. దీనితోపాటు ప్రయాణికుల సౌకర్యాలు కూాడా భారీ స్దాయిలో ఏర్పాటయ్యాయి. విశాలమైన పార్కింగ్ ఏరియా, అత్యాధునికమైన స్టేషన్ బిల్డింగ్ , కేఫిటేరియా, రెస్ట్ రూమ్స్, అనౌన్స్ మెంట్ సిస్టమ్స్, కొచ్ ఇండికేషన్స్ ఏర్పాటు చేశాం.
ప్రశ్న.. చర్లపల్లి రైల్వే స్టేషన్ లో నాలుగు పిట్ లైన్ల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలేంటి...?
సీపీఆర్వో శ్రీధర్...
పిట్ లైన్ అనేది రైలు భద్రతకు అత్యంత ప్రధాన్యత కలిగిన అంశం. మొదటి స్టేషన్ నుండి రైలు బయలుదేరే ముందు ఫిట్ నెస్ తనిఖీ తప్పనిసరి. పూర్తి స్థాయిలో భద్రతా తనిఖీ తరువాతే రైలు ప్రారంభమవ్వాలి. అయితే ఇక్కడ ఏకకాలంలో నాలుగు రైళ్లను తనిఖీ చేసే వ్యవస్థ ఏర్పాటు చేశాం. రైలు క్రింది భాగంలో వీల్స్, బోగీ వాటి ఫిట్టింగ్స్ ఇవన్నీ జర్నీకి ముందే పరిశీలించనున్నారు. ఏవైనా మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేసి , క్లీనింగ్ చేసి జర్నీకి సిద్ధంగా ఉంచుతాం.
దక్షిణ మధ్య రైల్వేలో మరెక్కడా లేని విధంగా ఎఫ్ ఓబి నిర్మాణం చేశారు.. ఈ ఆధునిక సౌకర్యాలకు రైల్వే స్టేషన్ పై ఎందుకు ఎంచుకున్నారు. కారణాలేంటి..?
సీపీఆర్వో శ్రీధర్...
12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) దక్షిణ మధ్య రైల్వేలో మరెక్కడా లేదు. చర్లపల్లిలోనే మొదటిసారిగా ఇంత పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాము. రాబోయే నలభై ఏళ్ల పాటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దీనిని నిర్మించాము. జంట నగరాలలో ఇప్పటికే వెస్ట్ సైడ్ ఉన్న లింగంపల్లిని కొంత వరకూ అభివృద్ధి చేసి కొన్ని రైళ్లను అటు మళ్లించాము. ఈస్ట్ వైపు కూడా సిటి విస్తరిస్తోంది. అందుకే చర్లపల్లిని ఎంచుకున్నాము. కలకత్తా, ఢిల్లీ, చెన్నై ఈ మార్గాలకు చర్లపల్లి మీదుగానే రైళ్లు వెళుతున్నాయి. ఇలా లొకేషన్ తోపాటు విస్తరణకు స్థలం కూడా చర్లపల్లి రైల్వేస్టేషన్ కు అందుబాటులో ఉంటంతో ఆధునిక టెర్మినల్ గా చర్లపల్లిని ఎంచుకున్నాం.
రైల్వే స్టేషన్ కు వచ్చే మార్గాల్లో ఇరుకు రోడ్లు, కనెక్టివిటి సరిగా లేదు, రోడ్లు విస్తరణ సాధ్యమేనా.. ఏం చేయబోతున్నారు..?
సీపీఆర్వో శ్రీధర్...
గతంలో పలుమార్లు ఇరుకు రోడ్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాము. అంతగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో స్టేషన్ బిల్డింగ్ , సదుపాయాలు పూర్తిచేసినా ఇప్పటికీ అప్రోచ్ రోడ్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. తాజాగా రోడ్ల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టిపెట్టింది. భూసేకరణ చేసి చర్లపల్లికి వచ్చే రోడ్డు మార్గాలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ప్రశ్న.. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ఎందుకు ఇంత విభిన్నంగా ఆధునికీకరించడానికి కారణాలేంటి..?
సీపీఆర్వో శ్రీధర్...
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పేరుతో ప్రధాన స్టేషన్లను భారీ స్దాయిలో అభివృద్ధి చేయాలని భావించారు. అందులో మొదటిగా చర్లపల్లి సిద్ధమైంది. అందుకే ఇంత విభిన్నంగా కనిపిస్తోంది. త్వరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్లతో ఆధునిక హంగులతోొ తీర్చిదిద్దుతాం. కాచిగూడ, నాంపల్లి ఇలా ఇతర స్టేషన్లను కూడా ఇలాగే చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాము.
చర్లపల్లిలో అధునాతన రైల్వే స్టేషన్ ఎప్పటి నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుంది..?
సీపీఆర్వో శ్రీధర్...
దాదాపు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడా ప్యాచ్ వర్క్స్ మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. త్వరలో అవికూడా పూర్తి చేస్తాం. ఈ నెలాఖరులోపు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. నిత్యం యాభై వేల మందికి పైగా ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా సకల సౌకర్యాలు చర్లపల్లి నూతన టెర్మినల్ లో ఏర్పాటు చేశాము.