తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అధ్యయనం చేసి ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపు అధికంగా ఉంటుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక జలాల వల్ల 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ఉందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. పంట నష్టంతో మనస్థాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదుదారుడి తరఫున న్యాయవాది శ్రావణ్ ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఎందుకు పట్టించలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశాలు జారీచేసింది.


Also Read: తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్.. రేపు స్టాలిన్ తో భేటీ


కాళేశ్వరం ప్రాజెక్టు


కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. గోదావరి నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటిని..మొత్తం 180 టీఎంసీలు ఎత్తిపోయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ ప్రాజెక్టు కోసం వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, ఆసియాలోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయం ఏర్పాటు, భూగర్భంలో నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. దీని కోసం మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ చేసింది ప్రభుత్వం. 18,25,700 ఎకరాల ఆయకట్టుకు 134.5 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్ధిరీకరణకు 34.5 టీఎంసీల కేటాయించనున్నారు. కాళేశ్వరం నుంచి హైదరబాద్ తాగునీటికి 30 టీఎంసీలు , గ్రామాల తాగునీటికి మరో 10 టీఎంసీలు పారిశ్రామికంగా అవసరాలకు16 టీఎంసీల నీటిని అందిస్తారు. 


Also Read: తెలంగాణలో బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి... లోక్ సభలో లేవనెత్తిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి


ప్రాజెక్టుపై వివాదాలు


ఈ ప్రాజెక్టు భూసేక‌ర‌ణ విషయంలో వివాదాలు నెలకొన్నాయి. సిద్ధిపేట ద‌గ్గర మ‌ల్లన్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణపై వివాదం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం చ‌ట్టం ప్రకారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఇస్తుంది. దీనిపై నిర్వాసితులు అభ్యంత‌రం వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాలు సేక‌రించాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది మోటార్లను పంప్​ హౌస్​​లను సక్సెస్​గా రన్​ చేసినా కొత్త ఆయకట్టుకు మాత్రం ఈ ప్రాజెక్టు నుంచి అందలేదు. వర్షాల వలన ముందు తోడిన నీరంతా మళ్లీ దిగువకు వదిలారని విమర్శలు వచ్చాయి. 


Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి