SLBC Collapse Rescue Operation | హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) ప్రమాదంలో లోపల చిక్కుకుపోయిన వారిలో ఒక మృతదేహం ఆదివారం లభ్యమైంది. దాదాపు 15 రోజులు సహాయక చర్యలు చేపట్టగా.. ప్రమాదం అనంతరం ఆచూకి దొరకని 8 మందిలో పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికితీసింది. గురుప్రీత్ సింగ్ ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (Tunnel Boring Machine) ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అమెరికా కు చెందిన రాబిన్ సన్ కంపెనీలో  ఉద్యోగి అయిన గురుప్రీత్ టన్నెల్ లో టిబిఎమ్ ఆపరేటర్ గా చేస్తున్నాడు.



25 లక్షల నష్టపరిహారం ప్రకటించిన రేవంత్ రెడ్డి 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో గురుప్రీత్ సింగ్ మృతి చెందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.  మృత దేహాన్ని పంజాబ్ లోని వారి స్వగ్రామానికి తెలంగాణ ప్రభుత్వం పంపించింది. గురుప్రీత్ మరణంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది దురదృష్టకరమైన ఘటన అన్నారు.


ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో కేరళకు చెందిన కెడావర్ డాగ్స్‌ రంగంలోకి దిగాయి. ఆ కెడావర్ డాగ్స్‌ కొన్ని స్పాట్‌లను గుర్తించడంతో.. అక్కడ తవ్వకాలు జరిగిన అధికారులకు ఒక మృతదేహం దొరికింది. టీబీఎంలో కార్మికుడి చేయి ఇరుక్కున్నట్టు అధికారులు భావించారు. మరింత లోతుగా తవ్వగా రాత్రికి టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని గుర్తించి, టన్నెల్ నుంచి బయటకు తెచ్చారు. మృతదేహాన్ని అతడి స్వస్థలానికి రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. 




సహాయక బృందాలకు శనివారం రాత్రి ఓ చేయి కనిపించింది. అయితే గట్టిపడ్డ మట్టిలోంచి మృతదేహాన్ని దెబ్బతీయకుండా తీసేందుకు సహాయక బృందాలు చాలా గంటల పాటు శ్రమించాయి. అనంతరం మృతదేహం నిలువున ఉన్నట్లు గుర్తించడంతో 12 అడుగుల మేర తవ్వారు. చివరగా టీబీఎం వ్యర్థాలను సైతం తొలగించాక ఆపరేటర్ గా చేస్తున్న గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని తీశారు. టన్నెల్‌ నుంచి గురుప్రీత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని అతడి స్వస్థలం పంజాబ్‌కు తరలించారు.


కేడావర్ డాగ్స్ గుర్తించిన చోట తవ్వకాలు


మొదటి వారం రోజుల అనంతరం ఆధునాతన టెక్నాలజీ వాడినా లోపల చిక్కుకున్న వారి జాడ తెలుసుకునేందుకు వీలు కాలేదు. పదహారో రోజు ఒకరి మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. ఆక్వా-ఐ యంత్రాలు, జీపీఆర్‌ రాడార్లు వాడినా ప్రయోజనం కనిపించకపోవడంతో కేరళ నుంచి కేడావర్ డాగ్స్ ను తెప్పించి, రంగంలోకి దించారు. మొదటగా జీపీఆర్‌ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా ఆచూకీ లభించలేదు. కేడావర్ డాగ్స్ రెండు ప్రాంతాలను గుర్తించగా తవ్వకాలు చేపట్టారు. న్‌డీఆర్‌ఎ్‌ఫ అసిస్టెంట్‌ కమాండెంట్‌ హరీశ్‌ శనివారం రాత్రి ఓ చేయి ఉన్నట్లు గుర్తించారు. టన్నెల్‌లో 13.8 కిలోమీటర్ల దూరంలో, టీబీఎంకు సమీపంలో ఈ ప్రాంతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సగం రోజుకు పైగా తవ్వకాలు జరిపి గురుప్రీత్ మృతదేహాన్ని వెలికితీశామని అధికారులు తెలిపారు. కేడావర్ డాగ్స్‌ గుర్తించిన మరికొన్ని ప్రాంతాల్లో 15 అడుగుల మేర తవ్వకాలు జరుపుతున్నారు. 


Also Read: Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !