Telangana Latest News: ఉదయం నుంచి జరుగుతున్న చర్చలు పూర్తి అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌కు అవకాశం ఇచ్చారు.
విజయశాంతి చాలా సైలెంట్‌గా తన పేరు లిస్ట్‌లో చేర్చుకునేలా చేశారు. ఈ మధ్యే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం చేసిన త్యాగాలు గురించి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటి వరకు తనను పట్టించుకోవడం లేదని ఆమె ఫీల్ అవుతున్నారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ టికెట్ ఇవ్వలేదు. ఆమెను ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గోనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కూడా ఆమె యాక్టివ్‌గా లేకుండా పోయారు. ఆమె ఫేడవుట్ అయ్యారని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు.
మొదటగా తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టిన విజయశాంతి తర్వాత చాలా పార్టీలు మారారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారు. ఇదే ఆమెకు పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓసారి గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీకి, కేసీఆర్‌కు దూరమయ్యారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. తెలంగాణ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓసారి మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
అద్దంకి దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వాడిన పదాలపై పార్టీలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై కోమటిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై స్పందించిన దయాకర్ ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడానని తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా బేషరతుగా క్షమాపణలు చెప్పారు.