Internal Marks for Inter Students: తెలంగాణలో ఇంటర్ విద్యలో సంస్కరణలకు బోర్డు మరోసారి స్వీకారం చుట్టింది. 100 మార్కులకు నిర్వహించే పరీక్షలను ఇకపై 80 మార్కులకే నిర్వహించనున్నారు. మరో 20 మార్కులకు ఇంటర్నల్స్‌/ప్రాజెక్ట్‌ వర్క్స్‌ చేపట్టనున్నారు. ఈ దిశగా ఇంటర్‌బోర్డు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. అయితే సిలబస్‌, పరీక్షావిధానంలో మార్పులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సంస్కరణలకు ఇంటర్‌బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే... వచ్చే విద్యాసంవత్సరం నుంచే 80 మార్కులకే ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశముంది.

వీటికి ఇంటర్నల్స్‌ మార్కులు..ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం 'ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌' పరీక్షను ఇంటర్నల్స్‌గా నిర్వహిస్తున్నారు. ఇది క్వాలిఫైయింగ్‌ పేపర్‌ మాత్రమే. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను రెగ్యులర్‌ మార్కులకు కలపడం లేదు. గతంలో ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను సైతం ఇంటర్నల్‌ పరీక్ష రూపంలో నిర్వహించేవారు. ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ను నిర్వహించడంతో ఈ పరీక్షను రద్దుచేసి ప్రస్తుతం బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రతిపాదిత ఇంటర్నల్స్‌లో 20 మార్కులుంటాయి. ఈ మార్కులను రెగ్యులర్‌ మార్కులకు కలుపుతారు. అసైన్‌మెంట్లు/ప్రాజెక్ట్‌లు విద్యార్థులే సొంతంగా రాయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌, వికీపీడియా నుంచి కాపీకొట్టడానికి వీల్లేదు. చాట్‌ జీపీటీ, ఏఐ టూల్స్‌ సహాయం తీసుకోకుండా విద్యార్థులు సొంతంగా అధ్యయనం చేసి ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రాజెక్ట్‌ వర్క్స్‌ ఇలా..✦ అర్థశాస్త్రం (Economics) విద్యార్థులు బడ్జెట్‌ పాఠంపై ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. వీరు కుటుంబ బడ్జెట్‌, లేదా వ్యక్తిగత బడ్జెట్‌పై ప్రాజెక్ట్‌వర్క్‌ (Project Work) చేయాలి.

✦ చరిత్ర (History) సబ్టెక్టు చదివే విద్యార్థులు తమ ప్రాంతం లేదా సమీప ప్రాంతంలోని చరిత్ర గురించి ప్రాజెక్ట్‌వర్క్‌ చేయాల్సి ఉంటుంది. 

✦ పొలిటికల్‌ సైన్స్‌ (Political Science) చదివే విద్యార్థులు ‘శాసనసభ నిర్మాణం అధికారాలు-విధులు’ పాఠానికి సంబంధించి అసెంబ్లీ నిర్మాణం, తమ నియోజకవర్గ ఎమ్మెల్యేపై ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది.

'JOST' ద్వారా ఇంటర్ ప్రవేశాలు!తెలంగాణ‌లో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను దోస్త్ (DOST) విధానం ద్వారా నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఇంటర్ ప్రవేశాలకు కూడా ఇదే తరహాలో 'జోస్ట్ (JOST)' ద్వారా ఆన్‌లైన్‌ అడ్మిషన్ ప్రక్రియ 2025 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. పదోతరగతిలో ఈ సారి గ్రేడింగ్ విధానం ఉండదు. గతంలో మాదిరిగానే మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసమే మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. జోస్ట్ విధానంలో 10వ‌ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు జూనియర్ కళాశాలలను ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అలాగే మెరిట్ ఆధారంగానే సీట్లను కాలేజీలను కేటాయిస్తారు. 

ఫీజులే అసలు సమస్య..జోస్ట్ విధానం అమల్లోకి వస్తే.. ప్రైవేట్ జూనియ‌ర్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజుల సంగతి ఎలా అనేది ప్రస్తుతం సమస్యగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా నియంత్రణ ఉండాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్‌తో పాటు ఎప్‌సెట్, జేఈఈ మెయిన్, నీట్ కోచింగ్‌లు అదనంగా ఇస్తుంటారు. వీటికి ఫీజులు కూడా విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీజుల విధానంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...