TGPSC Group1 Results: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 10న వెల్లడించనుంది. మొదట అభ్యర్థుల మార్కులను ప్రకటించిన తర్వాత.. అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్ కోసం ఆప్షన్లు స్వీకరించనుంది. ఈ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను కమిషన్ వెల్లడించనుంది. గ్రూప్-1 ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా సాధించినవి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరనుంది. 

పొరపాట్లు సరిచేసిన తర్వాతే ఫలితాలు.. అభ్యర్థుల మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కోపేపర్‌కు రూ.1000 చెల్లించి రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆయా పేపర్లలో మార్కులను మరోసారి గణిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో మొత్తం 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. అయితే వీరితోపాటు హైకోర్టు అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 7 పేపర్లు రాసిన అభ్యర్థులు 21,093 మంది ఉన్నారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేశారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను రూపొందించనున్నారు. 

మిగతా పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే..?గ్రూప్‌-1 ఫలితాలను మార్చి 10న విడుదల చేస్తుండగా.. మార్చి 11న గ్రూప్‌-2 ఫలితాలను, మార్చి 14న గ్రూప్‌-3 ఫలితాలను కమిషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా మార్చి 17న హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్స్‌ పోస్టుల ఫలితాలను, మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్‌ ఫలితాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టంచేసింది.

గ్రూప్-1 తర్వాత, గ్రూప్-2 పోస్టులకే ప్రాధాన్యం..తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ 2 ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. 783 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం ఎగ్జామ్‌ను డిసెంబ్‌ 15, 16 తేదీల్లో నిర్వహించింది. ఆ ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో 783 గ్రూప్-2 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉద్యోగాల కోసం 551,855 మంది అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో 2,50,000 మంది కంటే ఎక్కువ మంది పరీక్ష రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. రెండు రోజుల పాటు నాలుగు పేపర్లు రాశారు అభ్యర్థులు. ఒక్కో పేపర్‌ 150 మార్కులు కలిగి ఉంది. 150 క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఇచ్చారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...