Telangana News: ఎస్సీ వర్గీకరణ (Classification of SC)అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. వేర్వేరు మీడియా సమావేశాల్లో ఆ ఇద్దరు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తున్నారని, మాలల సూచనలు పాటిస్తున్నారని ఆరోపించారు. తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగకపోతే ఉద్యోగాల విషయంలో మాదిగ బిడ్డలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు.
మాలలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారు
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని రాజయ్య సూచించారు. సీఎం రేవంత్ బయటకు మాదిగలకు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నా.. లోలోపల మాలలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మాదిగ యువతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఉగ్యోగాల ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే ప్రయత్నం...
ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అంటూనే సీఎం రేవంత్ రెడ్డి మాలల సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే పనిలో సీఎం నిమగ్నమయ్యారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే.. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి యూనివర్సిటీల్లో నిరవధిక దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చాకే రాష్ట్రంలో ఉద్యోగాలను భార్తీ చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
మొన్న సీఎంకు మందకృష్ణ లేఖ
ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి శనివారం మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని సదరు లేఖలో పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని ప్రభుత్వం చెప్పిందని.. అంతలోనే గ్రూప్స్ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదన్నారు. వర్గీకరణ జరగకముందే ఫలితాలు వెల్లడిస్తే ఎస్సీలకు మళ్లీ అన్యాయం జరుగుతుందని మందకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశం
ఈనెల 6న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఏకపక్షంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి సుధీర్ఘంగా చర్చించి ఆమోదం తెలుపనున్నారు.
బీసీ కులగణన సర్వేపై కూడా..
బీసీ కులగణనపై చేపట్టిన సర్వేపై కూడా మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును కూడా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. అదే విధంగా సెర్ఫ్, మెప్మా రెండింటిని కలిపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నిక ఉద్యోగాల భర్తీ విషయంలో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ సూత్రాన్ని తెలంగాణలో అమలు చేయాలని కేంద్రాన్ని కోరాలని క్యాబినెట్ నిర్ణయించింది.