బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవన్నీ గలీజు పనులని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం అని పదే పదే మాట్లాడుతున్న ఈటల ఏ ముఖంతో బీజేపీలో చేరారని ప్రశ్నించారు. ప్రజలకు గడియారాలు పంచినప్పుడే ఆత్మగౌరవం ఖతమైపోయిందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
‘‘మనం పెంచి పెద్ద చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండెల మీద తన్ని వెళ్లిపోతే ఎలా ఉంటుంది? అలా ఉంది ఈటల వ్యవహారం. ఈటలకు రాజకీయ ఓనమాలు నేర్పింది కేసీఆర్. ఆయన్ను ఆరుసార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్. రెండు సార్లు మంత్రి కూడా చేశారు. అలాంటి తండ్రి లాంటి కేసీఆర్‌ను, తల్లి లాంటి టీఆర్ఎస్‌ను ఈటల గుండెల మీద తన్ని వెళ్లాడు. టీఆర్ఎస్ లేక ముందు ఈటల రాజేందర్ పేరు కూడా ఎవరికీ తెలియదు. టీఆర్ఎస్, గులాబీ జెండా వల్లే ఆయన ఎదిగారు. ఈటల రాజేందర్ దత్తత తీసుకున్న సిరిసేడును కూడా బాగు చేయలేదు.
ఈటల రాజేందర్ మాట్లాడితే ఆత్మగౌరవం అని అంటారు. ఆయన వామపక్ష వాది.. కానీ రైటిస్టు పార్టీలో చేరాడు. అప్పుడే ఆయన ఆత్మగౌరవం ఖతమైపోయింది. మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్లు పైసలు పంచుతున్నరు అంటడు. మా పార్టీలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు అందరూ టీఆర్ఎస్‌తోనే ఉన్నరు. నువ్వే గడియారాలు, గ్రైండర్లు, కుక్కర్లు, కుట్టు మిషన్లు, కుంకుమ భరిణెలు, గొడుగులు, సెల్ ఫోన్లు పంచుతున్నవు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఎప్పుడూ గడియారాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడే ఎందుకో ఇస్తున్నవు? రూ.9 కోట్లతో 50 వేల కుంకుమ భరిణెలు కూడా తెప్పిస్తున్నడు. ఓటర్లను కొంటున్నప్పుడు ఆత్మగౌరవం ఏమైంది?’’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్‌కు రూ.కోట్ల ఆస్తి ఉందని, అందుకే అన్ని బహుమతులు పంచుతున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. ‘‘హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు రెండు గుంటల భూమే ఉన్నది. గరీబోడు. మేమంతా శ్రీనివాస్ వెనక ఉంటం. ఆయన జిమ్మేదారి మొత్తం మేమే తీసుకుంటం. కాబట్టి, మోసం చేసిన ఈటల రాజేందర్‌ను వదిలేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండి’’ అని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంటలో సీతారామలింగేశ్వర ఆలయాన్ని రూ.10 కోట్లతో మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
‘‘హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే కనిపిస్తోంది. ఈటల రాజేందర్ హజూరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. మంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లు కట్టించలేకపోయిన ఈటల ఇప్పుడు గెలిస్తే కట్టిస్తారా? ఆయన గెలిస్తే ఏం చేయిస్తారో చెప్పాలి?’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Also Read: In Pics: హుజూరాబాద్‌లో రంగంలోకి దిగిన హరీశ్ రావు.. కార్యకర్తల్లో జోష్.. ఫోటోలు