కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోటోను ఎందుకు ముద్రిస్తున్నారు..? ఈ అంశంపై చాలా కాలంగా అంటే... వ్యాక్సిన్ వేయడం ప్రారంభమైన దగ్గర్నుంచి వివాదం ఉంది. సందేహం ఉంది. అన్ని పార్టీల నేతలు సంధిస్తున్న ప్రశ్నలూ ఉన్నాయి. ఓ దశలో  వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటోను ముద్రిస్తున్నట్లుగానే కరోనా డెత్ సర్టిఫికెట్లపై ఆయన ఫోటో ముద్రించాలనే డిమాండ్లు విపక్ష పార్టీలు చేశాయి.  అయితే ఇలాంటి డిమాండ్లను కేంద్రం పట్టించుకోదు అది వేరే విషయం కానీ... వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై నరేంద్రమోడీ ఫోటో ఎందుకు ముద్రిస్తున్నారన్న అంశంపై మాత్రం ప్రస్తుతానికి ఓ క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానం ఇచ్చారు.  


వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటో పెడుతోంది కేవలం అవేర్ నెస్‌ కోసం అంటే.. ప్రజలలో చైతన్యం, అవగాహన కోసమన్నమాట. ఎవరికి అవగాహన కోసం అనే ప్రశ్న ఎంపీ వేయలేదు కాబట్టి కేంద్ర మంత్రి కూడా సమాధానం చెప్పలేదు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీద మోడీ ఫోటో ఉంటే... వ్యాక్సిన్ వేయించుకోవాలన్న అవగాహన వస్తుందని... చైతన్యం వస్తుందని కేంద్రం భావించి ఉంటుంది. అందుకే అలాంటి సమాధానం ఇచ్చారని భావిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న పబ్లిసిటీ ఆసక్తి కారణంగానే వ్యాక్సిన్ సర్టిఫికెట్లపైనా ఫోటో వేసుకుంటున్నారని.. వ్యాక్సిన్ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నమని విపక్షాలు ఇంత కాలం విమర్శలు చేస్తూ వస్తున్నాయి.  అయినా ఇంత కాలం.. అలా ఫోటో వేసుకోవడానికి కారణం ఏమిటో చెప్పడానికి కేంద్రం ఇష్టపడలేదు. బహిరంగంగా ఎందుకు ఇక నేరుగా పార్లమెంట్‌లో చెబుదామని అనుకుందేమో కానీ.. చివరికి చెప్పేసింది. ఇప్పుడు విపక్షాల నోళ్లు మూతపడినట్లే భావించాలి.


ఇప్పటికీ కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని మోడీ బొమ్మ ఉంటోంది. ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రతిచోటా ప్రాధాన్యం లభిస్తోంది. కార్యాలయాల్లో అయినా ప్రయాణాలకు అయినా చివరికి విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా కూడా వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం కాలేజీలు ప్రారంభమవుతున్నాయి.. కాలేజీల్లో కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కంపల్సరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఇంకా ఇందులో కీలకమైన విషయం ఏమిటంటే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేయించుకున్నా... డౌన్ లోడ్ చేసుకునే సర్టిఫికెట్ మీద మోడీ బొమ్మ ఉంటుంది. వ్యాక్సిన్ ను ఎలా దూరం పెట్టలేమో సర్టిఫికెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బొమ్మను అలా దూరం పెట్టలేము. ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగించాల్సిందే. అలా అయితేనే  వ్యాక్సిన్ వేయించుకుంటే వ్యాధి నిరోధకరత... ఆ సర్టిఫికెట్‌తో అవేర్‌ నెస్ వస్తాయన్నమాట.