తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 9.45 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డితో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం మరోసారి దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 


కాగా, నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఇటీవల వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి దక్కిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ఒకసారి టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారు. తాజాగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యులను కూడా త్వరలోనే నియమిస్తామని బోర్డు ఇటీవల ప్రకటన చేసింది. 


వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 జూన్‌ 21న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీనికి రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది. 2021 జూన్‌ 21కి సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. దీంతో రెండో సారి కూడా వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 


కాలినడకన తిరుమలకు..


వైవీ సుబ్బారెడ్డి మంగళవారం సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లారు. శ్రీవారి మెట్టు వద్ద 116 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు కుటుంబసమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. 










Also Read: GSLV-F10 Launch: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఇస్రో సరికొత్త ప్రయోగం.. రేపు నింగిలోకి జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్‌10