భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎల్‌ఎల్‌వీ) సిరీస్‌లో మరో మిషన్‌ను నింగిలోకి పంపనుంది. జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లు ఇస్రో తెలిపింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో (షార్) బుధవారం తెల్లవారుజామున 3.43 నిమిషాలకు జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్10/ ఈవోఎస్-03 (GSLV-F10/ EOS-03 ) కౌంట్‌డౌన్ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించారు. ఈ రాకెట్ రేపు (ఆగస్టు 12) ఉదయం 5.43 నిమిషాలకు నింగిలోకి దూసుకుపోనుంది.
36 వేల కిలోమీటర్ల ఎత్తులో..
దీని ద్వారా 2,268 కిలోల బరువున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-03)ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహంలో మల్టీ స్పెక్ట్రల్ విజిబుల్ & నియర్ ఇన్‌ఫ్రారెడ్, హైపర్ స్పెక్ట్రల్ విజిబుల్ & నియర్ ఇన్‌ఫ్రారెడ్, హైపర్ స్పెక్ట్రల్ షార్ట్ వేవ్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్స్‌ను అమర్చారు.
జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్10 మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభంపై ఇస్రో ట్వీట్ చేసింది.
దీనికి సంబంధించిన విషయాలను ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. ఈ శాటిలైట్ ద్వారా దేశ రక్షణ వ్యవస్థ, విపత్తుల నిర్వహణకు సాయపడే భూపరిశీలన అంశాలను తెలుసుకునే వీలు ఉంటుంది.
ఈ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది. మిషన్ సంసిద్ధతకు సంబంధించి ఇస్రో చైర్మన్ శివన్ నేతృత్వంలో సమావేశం జరిగింది. దశలవారీగా రాకెట్ అనుసంధానంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశంలో ప్రయోగానికి అధికారికంగా అనుమతి ఇచ్చారు.
వాతావరణం అనుకూలిస్తేనే రాకెట్ ప్రయోగం వీలవుతుందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జరుగుతున్న ఈ ప్రయోగాన్ని తిలకించేందుకు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.