తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన మొదటి టాస్క్‌ను చాలా సక్సెస్‌ఫుల్‌గా అమల్లో పెట్టేశారు. ఇంద్రవెల్లి సభలో ఆయన టీఆర్ఎస్‌పై చేసిన విమర్శలు.. సీఎం కేసీఆర్‌పై దూకుడుగా అన్న మాటలు ఊహించిన దాని కన్నా ఎక్కువ రియాక్షన్స్ ఇచ్చాయి. చివరికి టీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయి... కాళ్లు , చేతులు నరుకుతాం అనే దాకా వచ్చారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ ఎమోషన్‌నే ఆశించారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు.
నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరాటం..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి దుర్భర పరిస్థితుల్లో ఉంది. ఎలాంటి ఎన్నిక జరిగినా కనీసం పోటీలో లేని పరిస్థితి ఉండేది. దానికి కారణం బీజేపీ వ్యూహం. అటు దుబ్బాకలో కానీ.. ఇటు గ్రేటర్ ఎన్నికల్లో కానీ బీజేపీ వ్యూహాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించదు.. ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు.. బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్లుగా ప్రచారం చేశారు. దుబ్బాకలో బీజేపీ ఎప్పుడూ బలంగా లేదు. కానీ అక్కడ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే ప్రచారాన్ని బలంగా చేయడం... టీఆర్ఎస్ కూడా ఆ పార్టీని టార్గెట్ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లిపోయింది. అదే వ్యూహాన్ని గ్రేటర్‌లోనూ అమలు చేశారు. టీఆర్ఎస్‌ను నేరుగా .. దూకుడుగా ఢీకొట్టడంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఫలితాలు కూడా అలానే వచ్చాయి. రాజకీయ చిత్రం మెల్లగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్..!
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మొదట ఇదే సమస్యను గుర్తించారు. పరిష్కరించాలని అనుకున్నారు. అప్పట్నుంచి సీన్ ను టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మార్చాలని నిర్ణయిచుకున్నారు. టీఆర్ఎస్ పాలనపై ఘాటుగా విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్‌పై అవసరమైనప్పుడల్లా వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. మొదట్లో టీఆర్ఎస్ పెద్దగా కౌంటర్లు ఇవ్వలేదు కానీ.. ఆయన మాటలు ప్రజల్లోకి బాగా వెళ్తూండటంతో గట్టిగా కౌంటర్లు ఇవ్వక తప్పడం లేదు. ఇప్పుడు అది తారస్థాయికి చేరింది. రేవంత్ తో.. కాంగ్రెస్‌తో తేల్చుకుంటామని టీఆర్ఎస్ అనే పరిస్థితి వచ్చింది.
బీజేపీని వ్యూహాత్మకంగా లైట్ తీసుకుంటున్న రేవంత్..!
రేవంత్ వ్యూహాత్మకంగా బీజేపీని సైడ్ చేస్తున్నారు. ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీనికి కారణం ఆ పార్టీకి అనవసరంగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండటమేనని అంచనా వేస్తున్నారు. రాజకీయం మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగితే... టీఆర్ఎస్ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కాంగ్రెస్‌లో చూస్తారని ..అప్పుడు బీజేపీకి కనీస ఓటు బ్యాంక్ కూడా ఉండదని విశ్లేషిస్తున్నారు. అందుకే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో బీజేపీపై కనీస విమర్శలు కూడా రేవంత్ రెడ్డి చేయలేదు. బీజేపీతో కుమ్మక్కయ్యారని కొంతమంది విమర్శలు చేయవచ్చు కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా బీజేపీని సైడ్ చేస్తున్నారనేది అసలు రాజకీయం అని భావిస్తున్నారు.