ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏళ్లుగా నిరీక్షిస్తున్న 1999 నాటి గ్రూపు-2 నోటిఫికేషన్ వ్యవహారానికి సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. 1999 నాటి గ్రూపు-2 వ్యవహారం, కొత్తగా ఇవ్వనున్న నోటిఫికేషన్లు సహా పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం (నేడు) ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సమావేశం జరగనుంది. ఈ చర్చలో తీసుకునే నిర్ణయాలను బట్టి 1999 నాటి గ్రూపు-2 అంశంపై మరింత స్పష్టత రానుంది.
రెండు దశాబ్దాలకు పైగా..
1999 నాటి గ్రూపు-2 వ్యవహారం రెండు దశాబ్దాలుగా పైగా న్యాయ వివాదాల్లో నలుగుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంగా ఉన్నప్పుడు 1999 డిసెంబరు 28వ తేదీన ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పది ప్రభుత్వ శాఖల్లో 104 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఏడు శాఖల్లో 141 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో ఉన్న 104 ఎగ్జిక్యూటివ్ పోస్టులను 2000 డిసెంబరులో భర్తీ చేసింది. మిగతా 141 పోస్టులను ఉపసంహరించుకుంది. దీనిని అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ తీవ్రంగా తప్పుబట్టింది.
రెండో విడతలో 141 ఏఎస్‌వో పోస్టులు ..
దీంతో రెండో విడత కింద 2002లో 141 ఏఎస్‌వో పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేసింది. మిగతా శాఖల్లో ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేయాలని నిరుద్యోగులు ట్రైబ్యునల్, హైకోర్టులను ఆశ్రయించారు. మూడో విడతగా 2005లో ఇంకో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదులో అదనంగా 973 ఎగ్జిక్యూటివ్, 199 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టులను చేర్చింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో..
మొదటి విడతలో భర్తీ చేసిన 104 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల ప్రకారం 1975 నవంబరు 15నాటి 763 జీవోను అమలు చేసింది. 2005లో అదనంగా ఇచ్చిన పోస్టులకు మాత్రం 2002 మార్చి 7న ఇచ్చిన 124 జీవోను అమలు చేసింది. 2005లో అదనంగా వచ్చిన పోస్టులకు.. మొదటి రెండు విడతల్లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారిని మినహాయించాలని హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. దీనిని పలువురు అభ్యర్థులు తప్పుబట్టారు. సచివాలయంలో ఏఎస్‌వోలను ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోకి ఎంపిక చేయకపోవడాన్ని నిరసిస్తూ.. అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సుప్రీంకోర్టు 2015, 2018, 2021 సంవత్సరాల్లో తీర్పులు వెలువరించిన విషయం తెలిసిందే. తన తీర్పుల్లో మరింత స్పష్టతను ఇస్తూ సుప్రీంకోర్టు గత నెలలో మరో తీర్పు వెలువరించింది. దీని ప్రకారం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మెమోలో ఏపీపీఎస్సీ 2018 మే 10న ప్రకటించిన అభ్యర్థుల జాబితాకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
సుప్రీం తీర్పుతో ప్రక్రియ వేగిరం..
దీనికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రక్రియ వేగిరం అయింది. కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా.. ఏపీపీఏస్సీ 2018 మే 10న ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను అనుసరించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత చర్చ జరిపేందుకు నేడు కమిషన్ భేటీ కానుంది.
Also Read:APPSC Recruitment 2021: ఏపీలో 1180 జాబ్స్.. కేటగిరీల వారీగా వివరాలివే..