తెలుగు చిత్ర పరిశ్రమలో పొలిటికల్ ధ్రిల్లర్ సినిమాలు తగ్గిపోయాయేమో కానీ రియల్‌గా మాత్రం ప్రేక్షకులకు అలాంటి ఫీలింగ్ కల్పించడానికి నటీనటులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రెండేళ్లకు ఓ బ్లాక్ బస్టర్ పొలిటికల్ ధ్రిల్లర్‌ను ప్రజలకు అందిస్తున్నారు. "మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్" ఈ ధ్రిల్లర్‌కు రెగ్యులర్ టైటిల్. అయితే పట్టుమని వెయ్యి మంది కూడా లేని సంఘం ఎన్నికలు ఎందుకు ఇంత రచ్చ అవుతున్నాయి..? నలుగురు పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటే ఏకగ్రీవం అయ్యే పదవి కోసం ఇలా ఎందుకు రోడ్డున పడుతున్నారు..? దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద అనుకున్న చిరంజీవి కూడా ఎందుకు డీల్ చేయలేకపోతున్నారు..?
హాట్ టాపిక్ అవుతున్న నటీనటుల రాజకీయాలు
సినిమా నటులంటే అందరికీ ఆసక్తి. వారి సినిమాల కంటే ప్రైవేటు లైఫ్‌పై ప్రజలు ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇక వారు బహిరంగగా తిట్టుకుంటే అంత కంటే ఆసక్తికరమైన వార్త ఏముంటుంది..? అందుకే మీడియా కూడా అలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విషయం తెలిసి నటీనటులే జాగ్రత్తగా ఉండాలి. కానీ టాలీవుడ్‌లో ప్రస్తుతం నటీనటులకు అలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కుతున్నారు. చిలువలు పలువులుగా ప్రచారం అవడానికి కారణం అవుతున్నారు. దీంతో టాలీవుడ్ నటీనటుల రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
చిరంజీవి తల్చుకుంటే ఈ గొడవలు ఉంటాయా..?
టాలీవుడ్ నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి అనేది ఎప్పుడూ గొప్ప పదవి కాదు. దాని వల్ల ఎలాంటి అధికారాలు రావు. కోట్ల కొద్దీ లావాదేవీలు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ సంఘం రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ప్రత్యేకంగా సినిమా అవకాశాలు కూడా రావు. దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నంత కాలం ఏకగ్రీవంగానే పదవికి ఎన్నికలు జరిగేవి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం సీన్ మారిపోయింది. ఎవరికి వారు తామే అధ్యక్షులవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా అనుకోవచ్చు.. కానీ అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికయితే సమస్య ఉండేది కాదు. కానీ అలా ఏకగ్రీవం కోసం ప్రయత్నించే పరిస్థితి లేకుండా పోయింది. దాసరి తరవాత ఇండస్ట్రీకి చిరంజీవే పెద్ద అని దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. కానీ చిరంజీవి కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు.
సామాన్య ఓటర్‌లా చిరంజీవి లేఖ రాయడం ఎందుకు..?
మా క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాశారు. వెంటనే ఎన్నికలు పెట్టాలని కోరారు. ఈ లేఖను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజంగా చిరంజీవి తల్చుకుని.. పెద్ద మనిషిగా బాధ్యతలు తీసుకుంటే.. ఈ సమస్య పరిష్కారం ఎంత సేపు అనేదే.. ఆ ఆశ్చర్యానికి కారణం. చిరంజీవి నేరుగా రంగంలోకి దిగి ఉంటే... ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోతుందనేది ఎక్కువ మంది చెప్పేమాట. అయితే చిరంజీవి మాత్రం తాను కూడా ఓ సాధారణ నటుడిలా... లేఖ రాశారు. ఇండస్ట్రీ అంతా ఆయనను పెద్ద అనుకుంటోంది కానీ ఆయనలో మాత్రం అలాంటి ఫీలింగ్ లేదని ఆ లేఖ ద్వారా చాలా మందికి ఓ అభిప్రాయం కల్పించారు.
బాధ్యత తీసుకుంటేనే నాయకుడవుతారు..!
ఎన్నికలు జరిగినా సాఫీగా సాగిపోవాలి. కానీ ఇక్కడ అసలు ఎన్నికలు పెడతారా లేదా అనే ప్రశ్న దగ్గర్నుంచి అనేక రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. డబ్బుల అవకతవకల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఒక రోజు వారు ఆరోపణలు చేయడం..మరో రోజు మరొకరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోతోంది. మొత్తంగా చూస్తే టాలీవుడ్ పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఆ నాయకత్వ అవకాశం చిరంజీవికి ఉన్నా ఆయన మాత్రం వేరే దారిలో వెళ్తున్నారనేదే టాలీవుడ్ అభిప్రాయం.