మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామంలో నివాసముంటున్న పింగిలి.శ్రీనివాసరావు, ప్రసన్న లక్ష్మీలకు కూతురు, కుమారుడు. శ్రీనివాసరావు డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. కుమారుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా, కూతురు దీపిక వీరితోనే ఉంటుంది. దీపిక బీటెక్ చదివే క్రమంలో ఓ రోజు వీధి కుక్క గాయాలపాలయై రోడ్డు పక్కన దీన స్థితిలో పడి ఉండటంతో చలించిన దీపిక దాన్ని ఇంటికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్న వీధి కుక్క వీరి కుటుంబం చూపిన ప్రేమ ఆప్యాయతలకు విశ్వాసంతో వీరితో కలిసిపోయింది. ఇలా ఒక శునకం మొదలైన వీరి కేరింగ్ ఇప్పుడు 100 శునకాలను పెంచుతున్నారు.
శునకాలకు ప్రత్యేక పేర్లు
ప్రతి రోజూ ఆ శునకాలకు ఉదయం, సాయంత్రం పాలు , రెండు పూటల భోజనం, వారానికి రెండు సార్లు మాంసాహారం, రెండుసార్లు గుడ్లు, స్నాక్స్ ను అందిస్తూ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు. వీరికి సహాయంగా వీటిని చూసుకునేందుకు 2 సంవత్సరాల క్రితం ఒక కేర్ టేకర్ ను నియమించుకున్నారు. వీటి పై నెలకు రూ.40- 50 వేలు ఖర్చు చేస్తున్నారు. ఈ శునకాలకు వీరు ప్రత్యేకంగా పేర్లు పెట్టుకున్నారు. ఆ పేరుతో పిలిస్తే అవి వెంటనే వచ్చేస్తాయి. వాటికి చెప్పకుండా వీరు ఎటైనా వెళ్తే గేట్ వరకు వచ్చి బాగా అరుస్తాయి. బయట నుంచి ఇంటికి రాగానే చిన్న పిల్లల వలె చుట్టుముట్టి మారాం చేస్తాయి.
చుట్టుపక్కల వాళ్లు ఏమనుకున్నా
ఈ శునకాలను సొంత పిల్లలుగా పెంచుకుంటున్నామంటున్నారు శ్రీనివాసరావు. చుట్టాలు ఇంటికి రాకున్నా పర్వలేదు అవే మా చుట్టాలు అంటున్నారు. పిల్లలకు పెళ్లి చేస్తే ఎవరి జాగాలో వారు వెళ్ళిపోతారని కానీ ఇవి మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటాయంటున్నారు. వీధి కుక్కలు పెంచుతుంటే ఊళ్లో వారు తీరొక్క మాటలు అనే వారని ఆ మాటలేం పట్టించుకోకుండా ఉండేవారిమని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శునకాలను పెంచలేక మా ఇంటికి వచ్చి వాటిని వదిలి వెళ్తుంటారని తెలిపారు. ఈ రోజుల్లో మనుషుల కన్నా శునకాలే విశ్వాసంతో ఉంటాయన్నారు. కుటుంబానికి ఒక్కొక్క శునకాన్ని అడాప్ట్ చేసుకుంటే ఇంకా మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Also Read: ఆ కాపు ఉద్యమ నేతలకు గుడ్‌న్యూస్.. టీడీపీ హయాంలో పెట్టిన కేసులన్నీ జగన్ సర్కార్ విత్ డ్రా