గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమం తునిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో  కేసులను ఎదుర్కొంటున్నవారికి జగన్ సర్కార్ ఊరటనిచ్చింది. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమంలో నమోదైన అన్ని కేసులను వెనక్కు తీసుకుంటున్నట్లు జగన్ సర్కార్ పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నమోదయిన కాపు ఉద్యమ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు వైసీపీ ప్రభుత్వం తెలిపింది.
 
2016 - 2019 మధ్య కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో నమోదయిన 176 కేసులను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఆ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమ సమయంలో తూర్పుగోదావరి జిల్లా  కిర్లంపూడి, ధవళేశ్వరం, అంబాజీపేట, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, గుంటూరు అర్బన్ తదితర పోలీసు స్టేషన్లలో ఏపీ పోలీస్ చట్టం, రైల్వే చట్టం కింద 329 కేసులు నమోదవగా వాటిలో 153 కేసులను ఇప్పటికే కొట్టివేశారు. మిగిలిన  పెండింగ్ కేసులను కూడా ఉపసంహరిస్తున్నట్టు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


2016 జనవరిలో తూర్పు గోదావరి జిల్లాలోని తుని పట్టణం సమీపంలో  కాపునేతల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమ సమయంలో విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు విచారణలో ఉండగానే ఉపసంహరించుకుంటున్నట్లు 2020లో జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం వ్యవహారంలోనే మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. వీటిలో 51 కేసులను 2019 లోనే వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మిగతా  కేసులను 2020లో ఉపసంహరించుకుంది. తాజాగా మరికొన్ని కేసులను వెనక్కి తీసుకోవడంతో చాలామంది కాపు నాయకులకు ఊరట లభించినట్లయింది.


టీడీపీ హయాంలో భారీ ఉద్యమం
కాపు నేత ముద్రగడ పద్మనాభం తమ సామాజికవర్గ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఉద్యమం చేపట్టారు. ఆయన పిలుపుతో కదిలిన కాపులు రోడ్లపైకి వచ్చి తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది ఉద్రిక్తతంగా మారి హింసకు దారి తీసింది. చాలామంది నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇలా టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు నేతలపై నమోదయిన కేసులను వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది.


అయితే, కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందినవారే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆయన భావిస్తున్నారు. కొంత మందితో కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఇటీవల ఓ బహిరంగ లేఖలో ముద్రగడ చెప్పారు. దానికి తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఆ కారణంగానే ఆయన ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.