" చరిత్రలో నాయకులు పుట్టలేదు..  నాయకులే చరిత్రలో నిలిచిపోయారు " .. సమయం, సందర్భం వచ్చినప్పుడు చరిత్ర ఓ నాయకున్ని తయారుచేసుకుంటుంది. అతడు లక్ష్యం వైపు గురిపెట్టి అస్ర్తాన్ని సంధిస్తాడు. విజయం సాధిస్తాడు. అలాంటి వారే చరిత్రలో ఉంటారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఇలాంటి నాయకుడే. తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ అనే రాష్ట్రం ఉనికిలోకి వచ్చిందంటే ఆయన నాయకత్వం వల్లనే. 


చింతమడకలో పుట్టి తెలంగాణ సారధిగా ఎదిగిన కేసీఆర్ !


తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్‌ 27 నాడు జలదృశ్యంలో పురుడు పోసుకుంది.  తెలంగాణ రాష్ట్ర సమితి నేడు దేశ రాజకీయ వ్యవస్థలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్నిదక్కించుకుంది. గుప్పిడు మందితో ప్రారంభించి..  2001లోనే  స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన పార్టీ ఇప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనే స్థాయికి ఎదిగింది.  ఇంతింతే వటుడింతై అన్న మాట కేసీఆర్‌కు సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్ పుట్టింది మెదక్ జిల్లా చింతమడక గ్రామం. 1954 ఫిబ్రవరి 17వ తేదీన రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ జన్మించారు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం భూమి కోల్పోయి చింతమడకకు వలస వచ్చింది. సిద్ధిపేటలో బీఏ చదివి.. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంఏ తెలుగు చదివారు. డిగ్రీలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులను కేసీఆర్ చదివారు. చదువుకునేటప్పుడే కేసీఆర్ నాయకత్వ లక్షణాలు చూపించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే కేసీఆర్ రాజకీయాల్లో బాగా చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగానూ వ్యవహరించారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమయింది.  కేసీఆర్ రాజకీయ గురువు సిద్ధిపేటలో కాంగ్రెస్ ప్రముఖ నేతగా ఉన్న అనంతుల మదన్ మోహన్. విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్‌లో చురుకుగా పని చేశారు. 1982లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ తరుపున.. తన రాజకీయాలు నేర్పిన గురువు మదన్ మోహన్ పైనే పోటీ చేసిన కేసీఆర్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ప్రతి ఓటమికి గెలుపునకు బాట అని ఆయన అప్పుడే అనుకున్నారు.


Also Read : నేడే టీఆర్ఎస్ ప్లీనరీ, 20 ఏళ్ల పార్టీ.. 60 ఏళ్ల కలను నెరవేర్చింది..! ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్


2 దశాబ్దాల టీఆర్ఎస్ పయనంలో ఎన్నో ఆటుపోట్లు !


ఆ తర్వాత 1985 లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి ఇక కేసీఆర్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1989, 1994, 1999 ఎన్నికలు, 2001 ఉప ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు. 1987లో మంత్రివర్గంలో చోటు దక్కింది. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. 1997లో క్యాబినెట్ మంత్రి పదవి వరించింది. 1999 నుంచి 2001 వరకు ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1999లో మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు చోటు కల్పించకపోవడంతో కేసీఆర్ అసంతృప్తికి గురయ్యారు. తెలంగాణ సాధించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు.


Also Read : బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రం.. కేసీఆర్, కవిత ఫోటోలు కూడా.. మీరూ చూడండి


ప్రారంభం నుంచే దూకుడు.. ఉద్యమమే ఊపిరి ! 


పార్టీ స్థాపించిన ఒక నెలలోనే తెలంగాణ నలుమూలలలా ఆరు భారీ బహిరంగసభలను నిర్వహించారు. 2001 జులైలో వచ్చిన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో, ఆగస్టులో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకొని పార్టీకి ఒక గట్టి పునాది వేయగలిగింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో తన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ గారు భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2003 మార్చిలో ఢిల్లీకి చేసిన కార్ల ర్యాలీ జాతీయస్థాయిలో అనేకమంది నాయకులను ఆకర్షించింది. 2004 ఎన్నికల్లో జాతీయపార్టీతో పొత్తు ఉంటే అది రాష్ట్ర సాధనకు ఉపకరిస్తుందని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు.


Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?


ఉపఎన్నికల వ్యూహంతో ఉద్యమానికి ఊపిరి !


2004లో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఐదుగురు ఎంపీలతో టీఆర్ఎస్ పార్టీ యూపీఏ కూటమిలో భాగస్వామిగా చేరింది. కేసీఆర్, ఆలె నరేంద్రకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. 2004 నుంచి 2006 వరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. కామన్‌ మినిమం ప్రోగ్రాం, రాష్ట్రపతి ప్రసంగం, ప్రధానమంత్రి ప్రసంగాల్లో తెలంగాణ ప్రస్తావన ఉంది. కానీ కాంగ్రెస్ హామీ నెర వేర్చకపోయే సరికి పదవులను వదిలేసి మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లారు.  ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2008లో కూడా ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగరవేశారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఉపఎన్నికలది కీలకమైన పాత్ర. ఆయన తన పని అయిపోయిందని అందరూ అంటున్న ప్రతి సారి ఉపఎన్నికలతో పైకి ఎదిగేవారు. మధ్యలో అనేక ఎదురుదెబ్బలు తగిలినా, కొన్నిసార్లు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఎత్తిన జెండా దించలేదు.


Also Read : దగ్గరపడుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ! ప్రస్తుతానికి ఇవీ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు !
 
చరిత్రలో నిలిచిపోయిన నిరాహారదీక్ష !


కేసీఆర్ జీవితంలో మరిచిపోలేని ఘటన.. 2009లో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఈ దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిది. 2009 నవంబర్ 29వ తేదీన తెలంగాణ కోసం కరీంనగర్ నుంచి సిద్దిపేట బయల్దేరగా కరీంనగర్ వద్ద గల అల్గునూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. కేసీఆర్ దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి రెండురోజులు బంధించారు. జైల్లో కూడా కేసీఆర్ నిరహార దీక్ష చేపట్టారు. అక్కడినుంచి నిమ్స్ తీసుకొచ్చినా దీక్షను కంటిన్యూ చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా.. తన దీక్షను విడవనని కేసీఆర్ మొండి పట్టు పట్టారు. దీంతో ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షిణిస్తుండటం.. తెలంగాణ ప్రజలు ఆవేశంతో రోడ్ల మీదికి వచ్చి ఉద్యమం చేస్తుండటంతో.. అప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఏ దిగిరాక తప్పలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అప్పటి మంత్రి చిదంబరం ప్రకటించడంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవడంతో పాటు.. కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. అప్పటి నుంచి మళ్లీ గొడవలు జరగడం.. ఆంధ్రాలో ఉద్యమం లేవడం.. కేంద్రం మరోసారి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను విరమించడం.. మళ్లీ ఉద్యమం తారా స్థాయికి చేరడం.. చివరకు 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి చూపించారు.


Also Read: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!
 
తెలంగాణలో తిరుగులేని నేత కేసీఆర్ !


ఉద్యమం తొలినాళ్ల నుంచి మొదలుపెట్టి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ ప్రతి దశలో అత్యంత నేర్పుతో, సంయమనంతో, పట్టువిడుపులు ప్రదర్శించారు కేసీఆర్‌. అటు ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నాయకత్వానికి భరోసా ఇస్తూ తెలంగాణ స్నప్నాన్ని సాకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి పదవీని కేసీఆర్ అదిష్టించి.. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఇమేజీ మరింత పెరిగింది. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారు. ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఉప ఎన్నికలే కాదు.. ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఏం చేసినా.. ఎలా చేసినా.. ప్రజల ఆదరణ పొందే విషయంలో...తెలంగాణ ప్రజల మనసుల్ని చదివినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఆయనను.. తెలంగాణలో ఎవరూ అందుకోని ఇమేజ్ ఉన్న మాస్ లీడర్‌గా నిలబెట్టింది. 


Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి