Breaking News Live: నేడు శివరాత్రి, భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 01 Mar 2022 08:37 AM
KCR Meet Kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్న కేసీఆర్‌.. ఆ దిశగా కేజ్రీవాల్‌తో చర్చించారు. ఇప్పటికే మహారాష్ట్ర సీఎంతో భేటీ అయ్యి తన స్ట్రాటజీ వివరించారు. ఇప్పుడు కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. 

KCR: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఫోన్ చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, తాను మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను స్టాలిన్ చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు ఎంకే స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.

Ongole Fire Accident: ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం, ఏకంగా 10 బస్సులు దగ్ధం

ప్రకాశం జిల్లా ఒంగోలులో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. వేమూరి కావేరి సంస్థకు చెందిన ప్రైవేటు బస్సులు మంటల్లో దగ్ధం అయ్యాయి. స్థానిక ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏకంగా 10 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. పార్కింగ్ స్టాండ్‌లో దాదాపు 20కి పైగా బస్సులు ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. మిగిలిన బస్సులను తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Vemulawada News: రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రమేష్ బాబు, రసమయి బాలకిషన్, జడ్పీ ఛైర్మన్ అరుణ పట్టు వస్త్రాలు సమర్పించారు. 

భక్తులతో పోటెత్తుతున్న శివాలయాలు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా  శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే శైవక్షేత్రాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు, భస్మాభిషేకాలు చేస్తున్నారు. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ మంత్రంతో శివ నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా క‌రోనా కార‌ణంగా అంతంత మాత్రంగా ఉన్న భ‌క్తుల ర‌ద్దీ ఈ ఎడాది పెరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రాలు అమ‌రావ‌తి రామ‌లింగేశ్వ‌ర స్వామి ఆల‌యం, కోట‌ప్ప కొండ ఆల‌యంలో భ‌క్తులు బారులు తీరారు. శివయ్య దర్శనానికి ఉదయం 3 గంటల నుండి  భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Hyderabad Gun Fire: హైదరాబాద్ శివారులో తుపాకీ కాల్పులు

హైదరాబాద్ శివారు ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పుల ఘటన జరిగింది. కర్ణంగుడా గ్రామ సమీపంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి తీవ్రంగా గాయాలపాలు అయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనంపై సైతం రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.

Khammam: స్నానాల లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి మహా జాతర 

ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురంలో మూడు రోజులపాటు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే విధంగా శివపార్వతులు కళ్యాణం వేడుకలు నిర్వహిస్తారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో రెండు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు చేస్తారు. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఉత్తర భాగాన నదీ ప్రవాహం ఉంది. ఈ దేవాలయము పురాతనమైనదని కోరిన కోరికలు తీర్చుతుందని భక్తుల విశ్వాసం.

Warangal News: వరంగల్ జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జామున నుంచే రుద్రుడి దర్శనం కోసం భక్తజనం తరలివస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. హన్మకొండలోని వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, రామప్పలో రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కొడవటూరులోని సిద్దేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మినరసింహ ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి భక్తులు తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు చేరుకొని వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Rajanna Sircilla: వేములవాడలో కిటకిటలాడుతున్న భక్తులు

రాజన్న సిరిసిల్ల ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి భారీగా చేరుకున్నారు. వేడుకలలో భాగంగా స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున నేడు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొడి గాలులు తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రత దిగొచ్చింది. పగటి పూట వేడి, ఉక్కపోత ఉన్నా, సోమవారం రాత్రి చలి మళ్లీ పెరిగింది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు నమోదైంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో  ఏపీలో మరికొన్ని రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.


ఆగ్రేయ గాలులు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వీచడంతో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు కాస్త తగ్గాయి. పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు అందులో సగం కూడా లేవు. మత్స్యాకారులకు వేటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని వెదర్ అప్‌డేట్‌లో పేర్కొన్నారు. అత్యల్పంగా కళింగపట్నంలో 15.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జంగమేశ్వరపురంలో 17.2 డిగ్రీలు, బాపట్లలో 18.3 డిగ్రీలు, నందిగామలో 17.9 డిగ్రీలు, అమరావతిలో 18.4 డిగ్రీలు, తునిలో 18.7 డిగ్రీలు,  విశాఖపట్నంలో 17.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


రాయలసీమలో ఉదయం వేడి.. రాత్రి చలి
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇక్కడ సైతం రాత్రిపూట చలి మళ్లీ పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు చలికి గజగజ వణికిన ఆరోగ్యవరంలో 16 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో 18.3 డిగ్రీలు, కర్నూలులో 17.9 డిగ్రీలు నంద్యాలలో 17.2 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భద్రాచలంలో, ఆదిలాబాద్‌‌లో, హైదరాబాద్‌లో 30 డిగ్రీలకు పైగా పగతి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) విపరీతంగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో నాలుగు రోజుల క్రితం బంగారం ధర అతి భారీగా ఎగబాకిన సంగతి తెలిసిందే. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. తాజాగా గ్రాముకు ఏకంగా రూ.66 చొప్పున పెరిగింది. వెండి ధర మాత్రం రూ.0.90 పైసలు పెరిగింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,280 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.69,900 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,900 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,280గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,900 వేలుగా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.