TDP News: ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ పొలిటికల్ గేమ్ ఆడిన తెలుగు దేశం పార్టీకి మరో లైఫ్ ఇచ్చిన సంవత్సరంగా 2024 అని చెప్పుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చిన పార్టీ ఉనికే ప్రమాదంలో పడింది. ఇది విశ్లేషకులు అన్నమాట కాదు పార్టీ నేతల భావన. అలా భయపడుతున్న సమయంలో తెలుగుదేశాన్ని ఏకంగా అధికార పీఠంపై కూర్చోబెట్టిన ఏడాదిగా 2024 ఎప్పటికీ నిలిచిపోతుంది. భవిష్యత్‌లో క్రైసిస్ వచ్చిన ప్రతిసారి ఈ సంవత్సరాన్ని స్ఫూర్తిగా చెప్పుకుంటుంది టీడీపీ.
23 నుంచి 135కు.. పతనం నుంచి పునరుజ్జీవం వరకూ...!
తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. దెబ్బతిన్న ప్రతిసారి అంతే బలంగా తిరిగి లేచింది. కానీ ఈసారి ఎదుర్కొన్న దెబ్బ అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో పార్టీకి తగిలిన దెబ్బ టిడిపి పునాదుల్ని కదిలించింది. కేవలం 23 సీట్లకు పరిమితం అయిపోవడంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసిపి 151 ఒక సీట్లను కైవసం చేసుకుంది.
పార్టీ ఓడోపోవడం, జగన్ ప్రభుత్వం పెడుతున్న కేసులు చేస్తున్న విమర్శలకు కీలక నేతలు అందరూ దాదాపు సైలెంట్ అయిపోయారు. ప్రెస్ మీట్ లు పెట్టడానికి కూడా కొందరు నేతలు మాత్రమే ధైర్యం చేసేవారు. డైరెక్ట్ గా అసెంబ్లీలోనే చంద్రబాబు ను టార్గెట్ చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు చేసిన వ్యాఖ్యలు సామాన్య ప్రజలను సైతం షాక్‌కు గురిచేసాయి. దానితో మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీ లో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు ఆక్షణం నుంచి తన వ్యూహాలకు పదును పెట్టారు.
మరోవైపు లోకేష్ యువగళం పేరుతో రాష్ట్రంలో పర్యటన ప్రారంభించారు. ఆఆ సమయంలో స్కిల్ స్కాం పేరు చెప్పి చంద్రబాబును జైల్లో వేసింది అప్పటి ప్రభుత్వం. ఇక టీడీపీ లేవదనే అంతా అనుకున్నారు. కానీ అప్పుడే పవన్ కల్యాణ్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది.
పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును ప్రకటించి దానికి బిజెపిని ఒప్పించి జగన్ పై పోరాటం మొదలుపెట్టారు. జైలు నుంచి వచ్చిన క్షణం నుంచి చంద్రబాబు అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు జైలు శిక్షతో ప్రజల్లో వచ్చిన సానుభూతిని టిడిపికి ఓట్ల రూపంలోకి మార్చడంలో చంద్రబాబు ఫుల్ సక్సెస్ అయ్యారు.
అన్నింటికీ మించి పవన్ అండతో ఆంధ్రప్రదేశ్ కనిగవినీ ఎరగని గెలుపును సొంతం చేసుకుంది కూటమి. 23 సీట్లతో ఆల్మోస్ట్ పార్టీ పని అయిపోయింది అనుకున్న స్థితి నుంచి 135 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటింది టీడీపీ. ఇంతటి గెలుపు టీడీపీ సైతం ఊహించలేదు.
ఆచితూచి అడుగులు వేస్తున్న చంద్రబాబు
2024 ఇచ్చిన గెలుపు ఉత్సాహంలో తప్పటడుగులు పడకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. అది ఆయన బాడీ లాంగ్వేజ్ లో చాలా క్లియర్ గా కనపడుతోంది. ఇంతకు ముందులా కాకుండా ప్రతిక్షణం ప్రజలతో కలిసి పోవడానికి ఆయన చూస్తున్నారు. ప్రజలు రాజకీయాల్ని ప్రతీ క్షణం గమనిస్తున్నారు అన్న జాగ్రత్త ఆయనలో కనపడుతోంది. పిల్లలు ఫోటో అడిగితే ఇచ్చేస్తున్నారు.. కలవాలని వచ్చిన సామాన్యులను దగ్గరికి చేర్చుకుంటున్నారు... చుట్టూ ఉండే సెక్యూరిటీ ఆంక్షలు కొంతమేర తగ్గించారు. అన్నింటిని మించి మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు. 2024 టీడీపీ లోనూ.. చంద్రబాబులోనూ తీసుకు వచ్చిన అసలైన మార్పు ఇదే అంటున్నారు చూస్తున్నవాళ్ళు.