Guntur Officials put the colony in the 22a list for which the government had made a sale agreement: ప్రభుత్వం అంటే నమ్మకం. ఆ ప్రభుత్వం వద్ద స్థలాన్ని కొనుగోలు చేస్తే ఇక భవిష్యత్ లో ఢోకా ఉండదని అనుకుంటారు. రిజిస్ట్రేషన్ కూడా స్వయంగా చేయించి ఇస్తే వారు ఇక ఆస్తి విషయంలో ఢోకా లేకుండా నిశ్చితంగా ఉంటారు. కానీ గుంటూరులోని నల్లకుంటగా పిలిచే లక్ష్మిరఘురామయ్య నగర్ కాలనీ వాసులు మాత్రం మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో   పదిహేనేళ్ల  కిందటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన స్థలాలను హఠాత్తుగా 22Aలో పెట్టేశారు. దీంతో అవసరాలకు అమ్ముకోవడానికి కాదు కదా తాకట్టు పెట్టుకోవడానికి కూడా చాన్స్ లేకుండా పోయింది. డబ్బులు కట్టి మరీ కొనుగోలు పత్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలాలను ఇలా 22Aలో పెట్టడం ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు. 


గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ పక్కనే లక్ష్మిరఘురామయ్య నగర్ 


గుంటూరులో మూడు దశాబ్దాల కిందట పేదలకు అప్పటి ప్రభుత్వం రెడ్డి కాలేజీ వెనుక ప్రాంతంలో  ఇంటి పట్టాలు ఇచ్చింది. అరవై అరు గజాల చొప్పున పేదలకు పంపిణీ చేసింది. వారంతా నిరుపేదలు, రోజుకూలీలు. అక్కడ వారు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ఇంటి స్థలాలకు హక్కులు కల్పించాయి. 2009లో ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసింది. లక్ష్మిరఘురామయ్యనగర్‌తో పాటు మరో మూడు పేదల కాలనీలకు కలిపి ఒకే జీవో ఇచ్చింది. అన్ని కాలనీల్లో గజంకు రూ. వంద చొప్పున విలువ కట్టింది. ఐదేళ్ల తర్వాత  సర్వ హక్కులతో అమ్మకాలు,కొనుగోలు చేసేలా ఒప్పందంలో రాశారు. ఆ ప్రకారం కాలనీ వాసులందరూ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఒప్పందంలో ఉన్నట్లుగా ఐదేళ్ల తర్వాత ఆ కాలనీ వాసులు క్రయవిక్రయాలు ఏ ఇబ్బందీ లేకుండా చేసుకుంటూ వచ్చారు.అమ్మకాలు చేసినప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగేవి. బ్యాంకుల్లో రుణాలు కూడా వచ్చేవి.


హఠాత్తుగా 22Aలో పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం 


వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది తమ కుటుంబ అవసరాలపై  ఇళ్లపై లోన్లు తీసుకునేందుకు బ్యాంకులను సంప్రదించారు. అయితే అప్పుడే వారు పిడుగులాంటి విషయం చెప్పారు. గుంటూరు కలెక్టర్ ఆ కాలనీ ఉన్న సర్వే నెంబర్ 153/2 ను 22Aలో పెట్టినట్లుగా చెప్పారు. దాంతో వెంటనే ఆ కాలనీ వాసులు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంప్రదించినా అదే సమాధానం వచ్చింది. దీంతో వారి గుండెల్లో రాయి పడినట్లయింది. ఇన్నేళ్ల తర్వాత .. డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏడాది తర్వాత మళ్లీ వాటిని వివాదాస్పద భూముల జాబితాలోకి పెట్టేసి లావాదేవీలు ఆపేయండంతో ఆ కాలనీ వాసులంతా ఆందోళన చెందుతున్నారు.


ప్రభుత్వమే జీవో ఇచ్చి మరీ  రిజిస్ట్రేషన్ చేసి ఇలా చేయడం భావ్యమా ?


ప్రభుత్వం 05.11.2003లో అంటే దాదాపుగా ఇరవై సంవత్సాల క్రితమే G.O.No. 503MA ద్వారా ఈ స్థలాలను క్రమబద్దీకరించింది. 2004లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ అధారిటీగా అందరికీ చదరపు గజానికి వంద చొప్పున కట్టించుకుని రిజిస్ట్రేషన్లు చేశారు.అలా క్రమబద్దీకరించిన వాటిని ఐదేళ్ల తర్వాత క్రయవిక్రయాలు చేసుకోవడానికి కూడా అగ్రిమెంట్ లో  హక్కు కల్పించారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన నిర్వాకంతో ఇప్పుడు వీరంతా  ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ఇప్పుడు 22A(1)(A)లో పెట్టడం అంటే ప్రభుత్వమే ప్రభుత్వాన్ని అవమానించుకున్నట్లని అంటున్నారు.


అందరూ నిరుపేదలే - నేతలకూ అలుసే !


ఈ కాలనీలో నివసించేవారంతూ ఇప్పటికీ పేదలే. అతి కష్టం మీద ప్రభుత్వం ఇచ్చిన 66 గజాల స్థలంలోనే చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. జీవితాంతం కష్టపడి కట్టుకున్న డబ్బులతో కట్టుకున్న ఇళ్లను ప్రాణాల మీదకు వచ్చినా.. పిల్లల పెళ్లిళ్లకు అయినా.. లేకపోతే మరో కారణం మీద అయినా కనీసం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కూడా ఈ పత్రాలు కుదువపెట్టుకుని లోన్లు ఇవ్వడానికి జంకుతున్నారు. పలువురు రాజకీయ నేతల వద్దకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. రెవిన్యూ సదస్సుల్లో కూడా అందరూ ఆర్జీలు ఇచ్చారు. కానీ వారి ఆందోళన తగ్గడం లేదు. 


ఒకరిద్దరి సమస్య కాదు ఇది మొత్తం కాలనీ సమస్య. ప్రభుత్వ అధికారుల తీరు వల్ల ప్రభుత్వ విశ్వసనీయతపైనే ఇలాంటి చర్యలు సందేహం కలింగేంచేలా ఉన్నాయని ప్రభుత్వం తక్షణం  ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.