Nirmala Seetharaman: సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గం ఖ్యాతి మ‌రోసారి దేశ స్థాయిలో మార్మోగిపోయింది. ప్లాస్టిక్ నిర్మూలనే ధ్యేయంగా సిద్ధిపేటలో రూపొందించిన స్టీల్ బ్యాంక్ విధానంపై పార్ల‌మెంట్‌లో కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడారు. ఆర్థిక సర్వే నివేదికలో సిద్దిపేటలో అమలు చేస్తున్న స్టీల్ బ్యాంక్ విధానంపై  ఆమె ప్రస్తావించారు. పునర్వినియోగించలేని ప్లాస్టిక్ వ్యర్థాల నేపథ్యంలో సిద్దిపేట వాసుల సరికొత్త సృజనాత్మక ఆలోచనను పార్ల‌మెంట్‌లో ఎక‌న‌మిక్ స‌ర్వే నివేదిక ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఈ ప్ర‌స్తావ‌న తీసుకొ్చ్చారు. 


దేశ ఆర్థిక స్థితిని అంచనా వేస్తూ ఏటా స‌ర్వే


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్ లో 2023-24 సంవ‌త్సరానికి సంబంధించి ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టారు. 2024-25 ఆర్థిక‌ సంవ‌త్స‌రానికి సంబంధించి మంగ‌ళ‌వారం బ‌డ్జెట్ స‌మ‌ర్పించ‌నున్న వేళ సోమ‌వారం ఆర్థిక స‌ర్వేను స‌భ ముందుంచారు. బ‌డ్జెట్ కు ముందు ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. గ‌త సంవ‌త్స‌ర కాలంలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే ఏడాది ఎదుర్కోనే స‌వాళ్ల‌ను ముందుగానే అంచ‌నా వేసి చెప్పేదే ఈ ఎక‌న‌మిక్ స‌ర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎక‌న‌మిక్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎక‌న‌మిక్ డివిజ‌న్ ఈ స‌ర్వేను రూపొందిస్తుంది. 2024 -25కి సంబంధించి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ 6.5 నుంచి 7 శాతం వృద్ధిని న‌మోదు చేయ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. 


ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యం


ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ ఆలోచన ఉద్భవించింది. గతంలో పెళ్లిళ్లు, ఫంక్షన్‌లలో ఎక్కడ చూసినా స్టీల్ వస్తువులే కనిపించేవి.. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వస్తువులే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు.. సిద్దిపేట స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. సిద్దిపేటలో జరిగే శుభకార్యాలు, విందులు, వినోదాల సందర్భంగా ప్రస్తుతం వాడుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు బదులుగా.. స్టీల్ బ్యాంకు‌లోని స్టీల్ ప్లేట్లు, గ్లాస్‌లను, ఇతర వస్తువులను జనాలను ఉపయోగించుకోవాలనేది దీని వెనక ప్రధాన ఉద్దేశం. ఈ స్టీల్ బ్యాంకులు.. ఇండ్లలో జరిగే వివిధ కార్యాలకు భోజనం ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు.. ఇలా పలు రకాల పాత్రలను ప్లాస్టిక్ పాత్రలకంటే తక్కువ ధరలో కిరాయికి ఇస్తుంటాయి. స్వయం సహాయక బృందాలకు స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు అప్ప‌గించారు. ప్లాస్టిక్ పాత్రలు, డబ్బాల్లో ఆహార వినియోగం కారణంగా తలెత్తే క్యాన్సర్ ముప్పు నుంచి కూడా నివారించినట్టే. 


2022లో కంటి వెలుగుతో అంకురార్ప‌ణ‌


2022లో కంటి వెలుగు కార్యక్రమం కోసం సిబ్బంది గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టారు. 15-20 మంది ఉండే బృందానికి భోజన సదుపాయం కోసం ప్లాస్టిక్ బదులుగా స్టీల్ పాత్రల వినియోగంతో ఈ కార్య‌క్ర‌మానికి అంకురార్ప‌ణ జ‌రిగింది. సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని పలు చోట్ల స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఇది సిద్దిపేటలోప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడింది. తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించింది. మైక్రో-ప్లాస్టిక్‌ల పరోక్ష వినియోగం వల్ల కలిగే క్యాన్సర్, జీర్ణ సమస్యల వంటి దుష్ప్రభావాల గురించి సమాజంలో అవగాహన పెంచడానికి ఇది సహాయపడింది. అంతేకాకుండా స్వయం సహాయక బృందాలు, గ్రామ పంచాయతీలు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి కూడా సహాయపడింది.


Also Read: ప్రమాదంలో ఏపీ ప్రజలు - ఊబకాయంలో మూడో స్థానం, తెలంగాణలో వారికే ఎక్కువ ముప్పు


Also Read: లోక్‌సభలో ఎకనామిక్ సర్వే, జీడీపీ అంచనాలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన