ప్రపంచంలో ప్రతి ఒక్కర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య స్థూలకాయం. వయో భేదం, లింగ బేధం లేకుండా స్థూల కాయం సమస్యతో ప్రపంచం మొత్తం సతమతం అవుతోంది. ఆహార నియమాలు, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్‌కు అలవాటు కావడం, పనిఒత్తిడి తదితర కారణాలతో ప్రతి ఒక్కరూ జీవితంలో ఈ సమస్యను అనుభవిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) స్థూలకాయంపై నిర్వహించిన సర్వేలో సంచలన వివరాలు వెల్లడయ్యాయి. 18-69 ఏళ్ల వయస్సు మధ్య గల స్త్రీ, పురుషుల్లో స్థూలకాయంపై జరిగిన ఈ సర్వేలో కోవిడ్ తర్వాత స్థూలకాయం గణనీయంగా పెరిగినట్టు సంస్థ వివరాలు వెల్లడించింది.
సర్వే ప్రకారం సగటున దేశంలో 22.9 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న18.9 శాతంతో పోల్చితే 4% పెరిగినట్టు సర్వే పేర్కొంది. ఇదే సందర్భంలో మహిళల్లోనూ స్థూలకాయం 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. స్థూలకాయంతో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానం, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉన్నాయి. ఢిల్లీలో మహిళల్లో ఒబేసిటీ 41.3 శాతం కాగా.. పురుషుల్లో 38 శాతంగా ఉంది. తమిళనాడులో 37 శాతం పురుషులు, 40.4 శాతం మహిళలు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 36.3 శాతం, పురుషులు 31.1 శాతం ఉండగా, తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతంగా ఉన్నారు. అంటే తెలంగాణలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.
గ్రామాల కన్నా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయం పెరిగినట్టు సర్వేలో గుర్తించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన (2019-2021)లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) నిర్వహించింది. మహమ్మారి విస్తృతి, లాక్‌డౌన్ ప్రభావంతో పరిమిత స్థాయిలో శారీరక శ్రమ కారణంగా స్థూలకాయం గణనీయంగా పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది.
స్థూలకాయం అనేది ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందిని ప్రభావితం చేసే అత్యంత సంక్లిష్టమైన మరియు ఎక్కువగా నివారించగల వ్యాధులలో ఒకటి. దీనిని గమనించకుండా వదిలేస్తే, 2030 నాటికి ప్రపంచంలోని యువ జనాభాలో దాదాపు 38% మంది అధిక బరువుతో, దాదాపు 20% మంది ఊబకాయంతో బాధపడుతారని అంచనా వేశారు.
మహిళలు ఊబకాయం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. టైప్ 2 మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, గర్భధారణ సమస్యలు (వంధ్యత్వం), లైంగిక సమస్యలు, హోర్మోన్ల అసమతుల్యం, ఎండోమెట్రియల్, అండాశయ, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్‌లకు ఊబకాయం ప్రమాద కారకం ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
పురుషుల్లోనూ స్థూల కాయం కారణంగా జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో పురుషులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
బరువును అదుపులో ఉంచుకుంటే స్థూలకాయం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానంలో మార్పులు చేసుకుంటే స్థూలకాయం రాకుండా జాగ్రత్త పడొచ్చని న్యూట్రిషియనిస్టులు చెబుతున్నారు.
Also Read : బరువు వేగంగా తగ్గాలంటే డైటింగే చేయాల్సిన అవసరం లేదు.. ఈ టిప్స్‌తో కూడా బరువు తగ్గొచ్చు