Nara Lokesh Responds On Tenali Veternary Doctor Harika's Death: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ హారిక (Harika) మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హారిక మృతదేహం స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన స్పందించారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త స్వాతిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా.. హారిక భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తెప్పించేలా ఎన్నారై టీడీపీ విభాగం కృషి చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.






రోడ్డు ప్రమాదంలో మృతి


గుంటూరు జిల్లా తెనాలికి (Tenali) చెందిన వెటర్నరీ డాక్టర్ హారిక (24) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని ఐతానగర్‌లో నివాసం ఉంటోన్న దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు, నాగమణి దంపతుల కుమార్తె హారిక. ఈమె గతేడాది పశువైద్యురాలిగా పట్టా అందుకుని.. ఎంఎస్ చేసేందుకు గత ఆగస్టులో అమెరికా వెళ్లారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం హారిక తన విధులు ముగించుకుని తోటివారితో కలిసి కారులో ఇంటికి బయల్దేరగా.. వీరి వాహనం వెళ్తున్న ప్రధాన రహదారిలో బైక్ ఒక్కసారిగా కింద పడడంతో నిలిపేశారు. దీంతో వెనుక నుంచి ఒకదాని వెంట ఒకటి మొత్తం 3 వాహనాలు ఈమె కారును ఢీకొన్నాయి. ప్రమాదంలో హారిక స్పాట్‌లోనే మృతి చెందారు. తోటి వారికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. హారిక మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. భౌతిక కాయాన్ని త్వరగా స్వస్థలానికి చేర్చాలని వేడుకుంటున్నారు. 


Also Read: YS Jagan : చంద్రబాబుకు భయం - విపక్ష హోదా అందుకే ఇవ్వట్లేదు - జగన్ కీలక వ్యాఖ్యలు