Jagan announced why YSRCP dharna in Delhi  : వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేయబోతున్న ధర్నాపై జగన్  కీలక ప్రకటన చేశారు.  కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని..  రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.   ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు.  అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని స్పష్టం చేశారు. 


బడ్జెట్ పెట్టడానికి కూడా ప్రభుత్వాకి భయం 


చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది  12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేక పోతోందన్నారు.  దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు.  చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే..,  పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న “భయం’’ ఉందన్నారు. ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో.., ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ‘‘భయం’’లో ఉన్నారన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని ఆరోపించారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారని విమర్శించారు. 


ప్రశ్నిస్తామన్న భయంతోనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు ! 


ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షమని జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది. కాబట్టి, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్నారు. కానీ, ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం పట్టుకుందన్నారు. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుందని.. అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత  ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని ఆరోపించారు.  ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబునాయుడి పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. 


దేశం దృష్టికి చంద్రబాబు అరాచకాలు


నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నామని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన, అక్కడ ఫోటో గ్యాలరీ.. ప్రొటెస్ట్‌ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లబోతున్నామన్నారు.  ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నామని..  మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.