Weather In Telangana: తెలంగాణలో మూడురోజులుగా వర్షం దంచికొడుతోంది. మూడురోజులుగా ముసురు వీడటం లేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వదలని వాన
తెలంగాణలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.
ముఖ్యంగా రాత్రిళ్లు వాన దంచికొడుతుండటంతో తెల్లారిచూసేసరికి వాగులు, వంకలు పొంగి రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పలు జిల్లాల్ల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అటు హైదరాబాద్‌లోనూ ముసురు వీడకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ జోరుగా వానలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులు దాటిపోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపు పదిలక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది.
రాకపోకలకు అంతరాయం
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు,వంకలు పొంగుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.దుమ్ముగూడెం మండలంలో సీతవాగు, గుబ్బలమంగివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.చత్తీస్‌ఘడ్, ఒడిశా కు రాకపోకలు నిలచిపోయాయి.రహదారులపై పొంగుతున్న వాగుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ప్రయాణం చేయకుండా అడ్డుకుంటున్నారు. పలు గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు సైతం నిలిపివేశారు.ములుగు జిల్లాలో 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. టేకుపల్లి వద్ద జాతీయ రహదారి మీదుగా గోదావరి ప్రవహిస్తోంది.ఏటూరునాగారం మండలంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సుల్తాన్‌పూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. నగరాల్లోనూ లోతట్టు కాలనీలు నీటమునిగాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వర్షం వీడకపోవడంతో పత్తి చేలు నీటిలో నానిపోతున్నాయి. కరీనంగర్ జిల్లాలో ఇళ్లు కూలిపోయాయి.
మరో మూడురోజులు వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం దృష్ట్యా మరో మూడురోజులు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో అధికారులు పసుపురంగు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరిలోనూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పంటపొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంట దెబ్బతింటోంది. మరో మూడురోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పకపోవచ్చు.
అధికారులు అప్రమత్తం
మరో మూడురోజులు వర్షాలు కురవనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రెస్క్యూ బృందాలు సైతం సిద్ధమయ్యాయి.అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ, వాగులు పొంగే ప్రాంతాల వైపు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు ప్రవహిస్తుండగా ఎట్టిపరిస్థితుల్లోనూ దాటవద్దని హెచ్చరిస్తున్నారు. మరో మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులుపడే అవకాశం ఉండటంతో పొలాలకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read: హైదరాబాద్‌కు చుట్టుపక్కలే అందమైన జలపాతాలు, పొద్దున్నే వెళితే సాయంత్రానికి తిరిగిరావొచ్చు
Also Read: భారీ వర్షాలతో అప్రమత్తం, గోదావరి ఉధృతిపై నిరంతరం నిఘా పెట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు