Three people dies at flat in Sanathnagar in Hyderabad హైదరాబాద్‌: నగరంలోని సనత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక జెక్‌ కాలనీలోని ఆకృతి రెసిడెన్సి అపార్ట్‌మెంట్‌ లోని ఓ ఫ్లాట్‌లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. రెండవ అంతస్తులో గల 204 ఫ్లాట్ లో చనిపోవడానికి కరెంట్ షాక్ కారణమని భావిస్తున్నారు. అయితే పోలీసులు వీరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇంట్లో ఎవరూ కనిపించలేదు 
రెండో అంతస్తులోని 204 ఫ్లాట్‌కు ఎప్పటిలాగే ఆదివారం ఉదయం పనిమనిషి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ కనిపించలేదు. తానెమో పని చేసి తిరిగి వెళ్లిపోయింది. ఇంట్లో వాళ్లు ఎవరైనా బాత్రూమ్ లో ఉన్నారని భావించింది. మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో మరోసారి ఫ్లాట్‌కు వెళ్లిన సమయంలోనూ ఇంట్లో ఎవరూ కనిపించలేదు. మొత్తం వెతకగా, చివరగా బాత్రూమ్ డోర్ లాక్ ఉన్నట్లు గమనించి, అపార్ట్‌మెంట్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకుని డోర్ పగలకొట్టి చూశారు. భార్యాభర్తలు వెంకటేష్, మాధవిలతో పాటు వారి కుమారుడు హరి చనిపోయి పడి ఉన్నారు.


అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 
కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావడంతో వీరు ముగ్గురు చనిపోయి ఉంటారని మొదట పోలీసులు, అపార్ట్ మెంట్ వాసులు భావించారు. కానీ కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి ఫ్లాట్ లో ఆధారాలు సేకరించిన అనంతరం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒకేసారి ఆ కుటుంబం మొత్తం ఇలా అనుమానాస్పదంగా మృతిచెందడంతో, అసలేం జరిగింది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు ఎందుకు చనిపోయారు, వారికి ఏ సమస్య వచ్చిందని అపార్ట్ మెంట్ వాసులు మాట్లాడుకుంటున్నారు. లేక ప్రమాదవశాత్తూ చనిపోయారా అంటే, అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని స్థానికంగా వినిపిస్తోంది.


Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం - తెనాలికి చెందిన వెటర్నరీ వైద్యురాలు మృతి